Friday, January 17, 2025

NZB | వీల్ చైర్స్ రోగులకు కాదా ?… బెడ్ షీట్స్ తీసు కెళ్లడానికా ?

రోగులను చేతులతో ఎత్తుకెళ్తున్న వైనం..
ఆస్పత్రి సిబ్బంది ఇష్టారాజ్యం ?
నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 17(ఆంధ్రప్రభ) : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను తీసుకెళ్లాల్సిన వీల్ చైర్ పై బెడ్ షీట్స్ తీసుకెళ్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో బెడ్ షీట్స్ కు ఇచ్చినంత ప్రాధాన్యత రోగులకు ఇవ్వకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ఓ వృద్ధురాలు ఆకస్మాత్తుగా మెట్లపై నుంచి కిందపడిపోవ డంతో కాలు విరిగింది. దీంతో చికిత్స కోసం శుక్రవారం ఉదయం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చింది.

కాలు విరిగి నడవలేని పరిస్థితిలో ఉండడంతో వృద్ధురాలి బంధువు ఆసుపత్రి సిబ్బందిని వీల్ చైర్ అడగగా పట్టించుకోకపోవడంపై రోగులు అసహనం వ్యక్తం చేశారు. సదరు వృద్ధురాలి బంధువు వీల్ చైర్ కోసం ఆసుపత్రి సిబ్బందిని బతిమాలుకొన్నా కనికరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగి బంధువులు వృద్ధురాలిని చేతులపై ఎత్తుకొని తీసుకెళుతున్న దృశ్యాలు ఆంధ్రప్రభ కెమెరా క్లిక్ మనిపించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అత్యధికంగా ఉండడంతో.. లిఫ్ట్ మొత్తం రోగులతో నిండిపోవడంతో.. వృద్ధురాలిని చేతులతో ఎత్తుకొని మెట్లపైనుంచి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా మరోవైపు.. మరో రోగికి బంధువులు ఎవరూ లేకపోవడంతో… లిఫ్ట్ వైపు పాకుకుంటూ రోగి వెళ్తున్న దృశ్యం ఆంధ్రప్రభ కెమెరా క్లిక్ మనిపించింది.

మరోవైపు బెడ్ షీట్స్ ని వీల్ చైర్ పై తీసుకెళ్తున్న వైనం..
వైద్యం కోసం వచ్చే రోగిని తీసుకెళ్లడానికి వీల్ చైర్ మాత్రం ఉండవు.. కానీ ఆసుపత్రి బెడ్ షీట్స్ తీసుకెళ్లడానికి వీల్ చైర్ ఎలా ఉంటుంది. ఒకవైపు చేతులతో రోగులను ఎత్తుకెళ్తున్న దృశ్యం.. మరోవైపు వీల్ చైర్ పై బెడ్ షీట్స్ ను తీసుకెళ్లడంపై వైద్యం కోసం వచ్చిన రోగులు మండి పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement