Friday, January 10, 2025

ADB | సంక్రాంతి పండుగకు ఉరెళ్తున్నారా…?

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
మంచిర్యాల, జనవరి 9 (ఆంధ్ర ప్రభ) : సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త అని, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నామ‌నే మీ అప్డేట్స్ పెట్టవద్దన్నారు.

స్వీయ రక్షణ కోసం ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకోవటం మంచిదని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100కి సమాచారం అందించాలన్నారు. సంక్రాంతి పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకి, విహార యాత్రలకు వెళ్లే ఆయా గ్రామాల, కాలనీల‌, ఆపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ సమయంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించగలరని తెలిపారు.

ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోవలన్నారు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదని, తమతో పాటే తీసుకెళ్లాలని, సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ అలారం మోషన్ సెన్సర్ ను ఏర్పాటు చేసుకోండం మంచిదన్నారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వండన్నారు.

- Advertisement -

వివరాలు నమోదు చేసుకొనే వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామ‌న్నారు. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలని, ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్ తో లాక్ వెయ్యడం మంచిదన్నారు. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మెన్, సెక్యూరిటీ గార్డ్, సర్వెంట్ గా నియమించుకోవాలని, మీ ఇంట్లో ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసర ప్రాంతాలను లైవ్ లో ప్రత్యేక్షంగా చూసుకోవచ్చన్నారు. సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, ఊరికి వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలన్నారు. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టన్ వేయాలని, ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలని, ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బంది కలిగినా డయల్ 100కు కాల్ చేయండని తెలిపారు. జిల్లాలోని ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీలను నియంత్రించడం సులభమ‌వుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement