వనపర్తి ప్రతినిధి, జనవరి 4(ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని, జనవరి 3న నిర్వహించే సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ లెవెల్ టీఎల్ ఎం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… అణగారిన వర్గాల బతుకులు మార్చిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఆయన అన్నారు. భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలుగా మహిళా లోకానికి ఎన్నో గొప్ప సేవలందించిన త్యాగమూర్తి సావిత్రిబాయి పూలే అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన ప్రదర్శనను ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులందరూ చదువుతో పాటు ఆటపాటలపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు టై, బెల్టులను అందజేశారు. ఈకార్యక్రమంలో వనపర్తి జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని, వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా విద్యా శాఖ సెక్టోరియల్ అధికారులు, మహిళా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.