అమరావతి, ఆంధ్రప్రభ: భాగ్య నగరానికి ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం తీరిపోయింది.. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అపాయింటెడ్ డే గా జూన్ 2వ తేదీతో గడువు ముగియనుంది.. అయితే అవశేష ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వాల విధానాల ఫలితంగా రాజధాని ఎక్కడ అనేది ఇంకా నిర్థారణ కాలేదు.. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాజధాని ఏర్పాటు కానుంది.
కాగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పొడిగించాలని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. అయితే ఇందుకు చట్ట సవరణ జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసు కోవాల్సి ఉంది.
విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు కొనసాగింది.. ఏపీ ముఖ్యమంత్రికి లేక్ వ్యూ అతిధిగృహంతో పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, పాత సచివాలయాల్లో వాటా పూర్తయింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌ను సంయుక్త రాజధానిగా పదేళ్లు ప్రకటించినప్పటికీ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా నిర్ణయించింది.
నిర్మాణాలు చేపట్టింది.అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల అంశాన్నితెరపైకి తీసుకు రావటంతో పాటు విశాఖ నుంచే పాలన సాగిస్తామని పునరుద్ఘాటించింది. అయితే ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది.. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి రాజధాని పొడిగింపుపై ప్రతిపాదనలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ చట్టపరమైన ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇందుకు పార్లమెంటు కూడా ఆమోదించారు.
అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రతిపాదించేందుకు ఏపీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే దీన్ని తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి..ప్రస్తుతం హైదరాబాద్‌లో లేక్‌వ్యూ, ఎన్‌ఎంహెచ్‌ఆర్‌ఎంసీ, ఏపీఈఆర్‌సీ, గ్రేహౌండ్స్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యదర్శుల క్యాంపు కార్యాలయాలు కొనసాగుతున్నాయి.
వీటికి తెలంగాణ ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తోంది.. ఈ పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఏపీలోని పార్టీల్లో స్పష్టత వచ్చిన తరువాత పొడిగించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చండీగడ్ తరహాలో హైదారాబాద్ ఉమ్మడి (కామన్) క్యాపిటల్ కాదు.. చట్ట ప్రకారం పదేళ్ల సంయుక్త (జాయింట్ క్యాపిటల్)గానే ఉండాలని నిర్దేశిం చారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రాజధాని చండీగడ్‌కు ఉన్నట్లుగా ఏపీతో హైదరాబాద్‌కు భౌగోళిక సారూప్యత కూడా లేదు.
1956 భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చారు. అయితే ఇక్కడ హైటెక్ సిటీ, ఇతరత్ర అభివృద్ధి జరిగినందున ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అప్పట్లో ఏపీ రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పదేళ్లు చట్టంలో వెసులుబాటు కల్పించారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం తరహాలోనే విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నందున అక్కడే రాజధాని ఏర్పాటు చేయాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది.. ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అమరావతి రాజధానిగా కొనసాగించనుంది. దశాబ్దాల కాలంగా రాజధాని హైదరాబాద్‌తో ఉన్న అనుంబంధానికి నేటితో ముగింపు పడనుంది.. ఉమ్మడి రాష్ట్రం తరహాలో కాకుండా విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు కూడా గణనీయంగా తగ్గాయనేది స్పష్టమవుతోంది.
ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లిన వాళ్లు ఇప్పటికే అక్కడ సెటిల్ అయి తెలంగాణతో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి రాజధాని ప్రస్తావన రాదని తెలంగాణ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన పూర్తయి దశాబ్ద కాలం గడవటంతో పాటు భాగ్యనగరంతో బంధం దూరం కావటంతో షెడ్యూల్డ్ ఆస్తుల పంపకాలే పరిష్కారం కావాల్సి ఉంది.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10, 13కు సంబంధించిన బదలాయింపులతో పాటు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల లావాదేవీలు పరిష్కారం కావాల్సి ఉంది. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించినప్పటికీ పార్టీ పరంగా విశాఖలోనే రాజధాని ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది.. ఈ పరిస్థితుల్లో ఇక హైదరాబాద్‌తో అనుబంధం తీరినట్లే అనేది స్పష్టమవుతోంది.