Friday, November 22, 2024

Telangana | తెలంగాణలో ఫాక్స్​కాన్​ ప్లాంట్​ ఏర్పాటుకు రెడీ.. తప్పుడు వార్తలను నమ్మొద్దు: సీఎంవో

తైవాన్‌కు చెందిన యాపిల్​ సప్లయర్​,  దిగ్గజ పారిశ్రమిక సంస్థ ఫాక్స్​కాన్​ తెలంగాణలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రెడీగా ఉందని ఆ సంస్థ చైర్మన్​ లియు తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు ఆయన రాసిన లేఖని ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్​ చేసింది.”మార్చి 2న జరిగిన సమావేశంలో మీతో చర్చించినట్లుగా, కొంగర కలాన్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఫాక్స్ కాన్ కట్టుబడి ఉంది. కొంగర కలాన్ పార్క్ ను వీలైనంత త్వరగా ప్రారంభించడంలో మీ బృందం మద్దతును కోరుతున్నాను” అని లియు తన లేఖలో రాశారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కొంగర కలాన్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాక్స్ కాన్‌కు 200 ఎకరాల భూమిని ఆఫర్ చేసింది. మార్చి 6 నాటి లేఖ కాపీని ముఖ్యమంత్రి కార్యాలయం ఇవ్వాల (CMO) విడుదల చేసింది. కాగా, తైవాన్‌కు వ్యక్తిగత అతిథిగా రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫాక్స్​కాన్​ చైర్మన్​ లియు ఆహ్వానించారు. ఫాక్స్ కాన్ తన చైర్మన్ ఈమధ్య తన పర్యటనలో కొత్త భారత పెట్టుబడుల కోసం ఎటువంటి ఒప్పందాలను కుదుర్చుకోలేదనే తప్పుడు వార్తలు ప్రచురితమవుతున్న నేపథ్యంలో సీఎంవో రెస్పాండ్​ అయ్యింది. యంగ్ లియు ముఖ్యమంత్రికి రాసిన లేఖను పోస్ట్ చేసిన తెలంగాణ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజై కరంపురి ట్వీట్ చేస్తూ.. “హైదరాబాద్ పర్యటనలో తనకు, తన బృందానికి అందించిన ఆతిథ్యానికి ఫాక్స్ కాన్ చైర్మన్ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు”అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

“మీ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. తెలంగాణ పరివర్తన, అభివృద్ధికి మీ దార్శనికత.. ప్రయత్నాల నుండి నేను ప్రేరణ పొందాను. నాకు ఇప్పుడు భారతదేశంలో కొత్త స్నేహితుడు ఉన్నారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను ”అని ఆ లేఖలో రాశారు.

లియు మార్చి 2న హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సమావేశంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు. లక్ష మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశంతో ఫాక్స్ కాన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. చారిత్రాత్మక ఒప్పందంతో 10 సంవత్సరాల కాలంలో లక్ష మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశం ఉందని తెలంగాణ సీఎంవో పేర్కొంది. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పనలో ఫాక్స్ కాన్ యూనిట్ తోడ్పడుతుందని, రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను ఆకర్షించడంలో దోహదపడుతుందని కేసీఆర్ చెప్పారు.

- Advertisement -

తైవాన్‌ను తెలంగాణ సహజ భాగస్వామిగా పరిగణిస్తోందని, ఫాక్స్ కాన్ వృద్ధి కథనంలో రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్‌ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని లియుకు కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంపై తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని ఫాక్స్ కాన్‌ చైర్మన్‌ను ఉటంకిస్తూ సీఎంఓ పేర్కొంది. రాష్ట్రంలో స్నేహపూర్వక పారిశ్రామిక అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను రూపొందించారని కొనియాడారు. కేవలం ఎనిమిదేళ్లలో పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఐటీ, సంబంధిత ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి పట్ల లియు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ కంపెనీ పెట్టుబడులపై ఆశాజనకంగా ఉన్నామని చైర్మన్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement