హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లాలో 24 గంటలు గడవకముందే రుణభారంతో మరో రైతు రాథోడ్ గోకుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని, రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్యాంకుల వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల చావులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఉసురు ఎందుకు తీస్తున్నారని నిలదీశారు.ప్రభుత్వమే బాధ్యత వహించాలి..రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రైతులకు భరోసా కల్పించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని తెలిపారు.
వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులు దేశానికి వెన్నెముక అని.. అలాంటి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఇప్పటి వరకు 𝟒𝟎𝟐 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.