Tuesday, November 26, 2024

ఈ నెలాఖరున అపెక్స్‌ కౌన్సిల్ భేటీ.. కృష్ణా, గోదావరి వివాదాల పరిష్కారం అయ్యేనా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం దిశగా మరోసారి అపెక్స్‌ కౌన్సిల్ భేటీ జరగనుంది. ఈ నెలాఖరున జరిగే కేంద్ర జలశక్తిమంత్రిత్వశాఖ నిర్వహించే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలోనైనా కృష్ణా జలాల పున: పంపిణీ, జల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక సానుకూల అడుగులు ఏమైనా పడుతాయా..? అని తెలంగాణ సాగునీటిశాఖ అధికారులు వేచి చూస్తున్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ప్రత్యేకించి కృష్ణా నదీ జలాల విషయంలో ఏపీ, తెలంగాన రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై మరోసారి చర్చ జరగనుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నో అభ్యంతరాలు, వివాదాలు నెలకొని ఉన్నాయి.

గతంలో 2020 అక్టోబరు 6న అపెక్స్‌ కౌన్సిల్‌భేటీ జరిగింది. ఆభేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్‌షెకావత్‌తో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు రెండు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాలు జరిగాయి. ఈ నెలాఖరున మూడో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గోదావరి నదీపైన ఎలాంటి అంతరాష్ట్రప్రాజెక్టులు లేనందున జీఆర్‌ఎంబీ బోర్డు అవసరం లేదని తెలంగాణ వాదిస్తుండగా… తెలంగాణ దాదాపు నిర్మాణం పూర్తి చేసినకాళేశ్వరం ప్రాజెక్టుఅక్రమమని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. కృష్ణా నదీ విషయంలో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా బేసిన్‌ అవతలకు ఏపీ ప్రభుత్వం అక్రమంగానీటిని తరలిస్తోందని తెలంగాణ వాదిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పున: పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌(కేడబ్ల్యూటీ-2) ప్రకారం నదీ జలాల పున: పంపిణీ జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేస్తోంది. కృష్ణలో 75శాతం ఆధారపడిన దగిన జలాల ప్రాతిపదికన తెలంగాణకు 574 టీఎంసీలు రావాల్సి ఉందని ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు నీటి కేటాయింపులను పున: పంపిణీ చేయాలని కోరినా కేఆర్‌ఎంబీ స్పందించటంలేదని, గతంలో ఉన్న విధంగానే 299 టీఎంసీలనే కేటాయిస్తోందని ఫిర్యాదు చేసింది. అదేసమయంలో ఇంటర్‌ స్టేట్‌ రివర్‌ వాటర్‌ డిస్ప్యూట్‌ యాక్టు-1956లోని సెక్షన్‌ 3ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి, మరీ ముఖ్యంగా కృష్ణలో జల వివాదాల పరిష్కాంరానికి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో తెలంగాణ కోరుతోంది.

ఈ అంశాల నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో ఢిల్లిలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణ జల వివాదాల అంశాలతోపాటు గోదావరి నదీపై నిర్మిస్తున్న ఆరు ఎత్తిపోతల ప్రాజెక్టులకు అనుమతులను త్వరగా మంజూరు చేసేలా ఆయాశాఖలను ఆదేశించాలనిఅపెక్స్‌ కౌన్సిల్‌ ఎదుట తెలంగాణ తన వాదన వినిపిస్తుందని నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కౌన్సిల్‌ సమావేశం ఏజెండాలో చేర్పించాల్సిన అంశాలను ఉన్నతాధికారులు ఆచితూచి సిద్ధం చేస్తున్నారు. ఇందుకు తెలంగాణ నీటిపారుదలశాఖలో ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందం కసరత్తు చేస్తోంది. మరోవైపు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి ముందు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశాలు జరగాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement