Friday, November 22, 2024

AP/TG – ప్ర‌సాదాలకు ల్యాబ్‌ టెస్ట్‌ – నాణ్య‌తపై ప‌రీక్ష‌లు

తెలంగాణ‌లోని అన్ని ఆల‌యాల‌కు ప్ర‌భుత్వం ఆదేశం
ప్ర‌ముఖ ఆల‌యాల ల‌డ్డూ శాంపిల్స్ ల్యాబ్‌ల‌కు
నెయ్యి, ఇత‌ర వినిమ‌య ప‌దార్ధాల త‌నిఖీ
హైద‌రాబాద్‌లో టెస్ట్ చేయ‌నున్న నిపుణులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్:
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రసాదాలను పరీక్షించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ భద్రకాళి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం ఇప్పటికే హైదరాబాద్ లోని ల్యాబ్​కు అధికారులు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్‌ చర్లపల్లిలోని ల్యాబ్​కు పంపించారు. టెస్టులకు సంబంధించిన నివేదిక నాలుగైదు రోజుల్లో రావొచ్చని ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ఇక్కడ కొన్నేండ్లుగా మదర్​డెయిరీ నెయ్యి వాడుతున్నారు.

- Advertisement -

భ‌ద్రాచలంలో ప్ర‌త్యేక క‌మిటీ..

భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని నియమించినట్టు ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా నెయ్యి శాంపిల్స్ ను టెస్టులకు పంపించామని తెలిపారు. ఆలయంలో రోజూ 3 వేల నుంచి 4 వేల లడ్డూలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వేములవాడ ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిని 20 రోజుల క్రితమే పరీక్షలకు పంపించారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి చాలా రోజులుగా కరీంనగర్ ​డెయిరీ నెయ్యిని వాడుతుండగా, దేవాదాయ శాఖ ఆదేశాలతో వారం నుంచి విజయ డెయిరీ నెయ్యిని వినియోగిస్తున్నామని ఈవో విజయరామారావు తెలిపారు. హనుమకొండలోని భద్రకాళి టెంపుల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి, ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్​కు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement