Tuesday, November 26, 2024

స‌రిహ‌ద్దుల‌లో ర‌గ‌డ‌…

తెలంగాణకు ఏపీ అంబులెన్స్‌ల క్యూ!
బెడ్లు ఖరారైతేనే రావాలని నిలిపివేసిన తెలంగాణ
మా ప్రజలకే బెడ్లు, మందుల్లేవ్‌
మీరంతా మా మీద పడితే ఎలా
కోటా పెట్టి మందులిస్తున్న కేంద్రం
తెలంగాణ పాజిటివ్‌లకు మందుల కొరత
ఢిల్లీకి తెలంగాణ ప్రజలను రానిస్తున్నారా క్వారంటైన్‌ నిబంధనలు లేవా
సరిహద్దుల్లో పోతున్న ప్రాణాలు
బాధితుల ఆక్రందనలు
పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, బ‌: తెలంగాణ, ఎపి సరిహద్దుల్లో మరణమృదంగం మోగుతోంది. ప్రాణభయంతో మెరుగైన వైద్యం కోసం ఎపికి చెందిన బాధితులు హైదరాబాద్‌ వైపు తీస్తున్న పరుగులకు తెలంగాణ పొలిమేరల్లోనే పోలీసులు బ్రేకులు వేస్తున్నారు. మీ రాష్ట్రం.. మీ ఇష్టం.. కొవిడ్‌ బాధితులున్న అంబులెన్స్‌లను మా ప్రాంతంలోకి అనుమతిచ్చేదిలేదని ఖరాఖండిగా చెబుతున్నారు. హైదరా బాద్‌లో బెడ్లు ఖరారై ఉంటే.. అందుకు సంబంధించిన అనుమతి పత్రాలు చూపాకే తెలంగాణలోకి అనుమతిస్తామంటున్నారు. ప్రధానంగా రాయలసీమలో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రం ఉండడం, కేసులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో.. జనం హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. శుక్రవారం ఉదయం 20 అంబులెన్స్‌లకు పైగా రాగా, కర్నూలు సరిహద్దులోని గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు నిలిపేశారు. బాధితుల ఆక్రందనలు, రోదనలు.. ఎపి ప్రభుత్వం నుండి వారిని యుద్ద ప్రాతిపదికన రక్షించే చర్యలు లేకపోవడంతో అంబులెన్స్‌ల్లోనే ఇద్దరు కన్నుమూశారు. మరోవైపు సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద ఏపీ అంబులెన్స్‌లను నిలిపేస్తున్నారు. రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకోవ డంతో వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని అనుమతించే విషయంలో.. తెలంగాణ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నా, మందుల కొరత.. ఆక్సిజన్‌ కొరత, కేంద్రం తీరుతో నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. అంబులెన్స్‌లు ఆపడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వతీరును ఆక్షేపించింది.
తెలంగాణకే ప్రత్యేక రూల్సా?
ఒక్క తెలంగాణకే ప్రత్యేక రూల్స్‌ ఉంటాయా? దేశంలోని రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు అన్నీ మామూలు మనుషులు కూడా కోవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉంటే కానీ తమ రాష్రం, దేశంలోకి రానీయం అని నిబంధనలు పెడుతున్న సమయంలో, ఏకంగా కోవిడ్‌ పేషంట్లనే తెలంగాణలోకి అనుమతించాలని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఏంటని తెలంగాణ అధికారవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆక్సిజన్‌, రెమిడిసివిర్‌, టాసిలిజుమాబ్‌, వ్యాక్సిన్‌ ఇవన్నీ రాష్ట్రాలకు కేంద్రం కోటా పెట్టి ఇస్తోంది. మరి పక్కన ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న 30-40 శాతం పేషంట్లకు అదనంగా ఇవన్నీ కేంద్రం ఇస్తుందా? అట్లా ఇవ్వనప్పుడు తెలంగాణ ప్రజలు వేరే రాష్ట్ర ప్రజల కోసం ఎందుకు త్యాగాలు చేయాలి? తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల కోసం మాత్రమే పని చేస్తుంది. ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత తెలంగాణ ప్రజలు మాత్రమే అంటూ తెలంగాణ ప్రభుత్వవర్గాలు, ప్రజాప్రతినిధులు గట్టిగా చెబుతున్నారు. తాజా సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఢిల్లి వంటి రాష్ట్రాలు పెట్టిన నిబంధనలను, మందుల కొరత అంశాన్ని ఉటంకిస్తున్నారు. వలస కార్మికులను కూడా గుండెల్లో పెట్టుకుని ఆకలితీర్చిన మానవీయ ప్రభుత్వం తమదని, మందులు.. ఆక్సిజన్‌ అన్నీ కేంద్రం తమ గుప్పిట పెట్టుకున్న పరిస్థితుల్లో తమ ప్రజలను రక్షించుకోవడమే తమ ముందున్న కర్తవ్యం అని చెబుతున్నారు.మంచిర్యాలలో మహారాష్ట్ర రోగులు. హైదరాబాద్‌లో ఎపి, మహారాష్ట్ర రోగులు, కరీంనగర్‌లో ఛత్తీస్‌గడ్‌ రోగులు.. ఇలా అన్ని తెలంగాణ జిల్లాల్లో ఇతర రాష్ట్రాల రోగులు వచ్చి చేరితే.. మరి ఆపద సమయంలో తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోవాలి? అని ప్రభుత్వవర్గాలు, అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి ప్రజలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోవొద్దా? మానవత్వం అని మాట్లాడుతున్నవాళ్లు.. తెలంగాణ ఇబ్బందులు పట్టించుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ తెలంగాణ ప్రభుత్వ తీరును సమర్ధిస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. టోసిలిజుమాబ్‌ తెలంగాణ రాష్ట్రానికి 680 డోసులు ఇస్తే ఎంతమంది రోగులకు సరఫరా చేయగలమని ప్రశ్నిస్తున్నారు.
తప్పుపడుతున్న విపక్షాలు
కాగా తెలంగాణ ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రాణా పాయ స్థితిలో ఉన్నవారితో చెలగాటమాడవద్దని, మానవత్వంతో వ్యవహరిం చాలని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సూచిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా.. సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేత సరికాదని ఖండించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement