హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొత్త సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, కాలువల మరమ్మతులు, ఆధునీకరణ, సామర్థ్యం పెంపు తదితర పనులను కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతిస్తేనే చేపట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ విషయమై కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మంగళవారం లేఖల ద్వారా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏపీప్రభుత్వం అక్రమంగా జీవో 64 జారీ చేసి మరీ కర్నూలు జిల్లా పాన్యం మండలం పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) ఏర్పాటుకు గ్రీన్కో ఏపీ01 సంస్థకు టెండర్ కట్టబెట్టిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం కుడికాలువ పై ఉన్న గోరకల్లు రిజర్వాయర్ ద్వారా పోతిరెడ్డిపాడు మీదుగా నీటిని తరలిస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 84, 85 నిబందనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.
ఈ తరహా ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని గతేడాదే తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మే 18న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌లోని తెలంగాణలో సాగునీటికి తీవ్ర కటకట ఉన్నా… ఏపీ ప్రభుత్వం బేసిన్ అవతల ప్రాంతాలకు నీటిని తరలిస్తూ హైడ్రో ఎ లక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మించడం శోచనీయమన్నారు. అదేవిధంగా… పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు కృష్ణా నదిలో నీటి కేటాయింపులు చేపడుతున్నా ఏపీ ప్రభుత్వంపై కేఆర్ఎంబీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయిందని మరో లేఖలో ఈఎన్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఎన్నిసార్లు ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణ వ్యవహారాన్ని బోర్డు దృష్టికి తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేఆర్ఎంబీని కోరారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల జాబితాను తెప్పించుకోవాలని బోర్డును కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..