హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
గోదావరి నీళ్లను పెన్నాకు తీసుకెళ్లేందుకు ఏపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. గోదావరి నీళ్లను ఏపీకి తీసుకెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..? బనకచర్ల ఆపాలని ఏపీకి కనీసం లేఖ కూడా రాయలేదని సీఎం రేవంత్ రెడ్డిని ఎత్తి పొడిచారు. . నాలుగు ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రాజెక్టులకు అనుమతుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.. బనకచర్లకు నిధుల కోసం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని, ఆ లేఖపై కేంద్రంలో దస్త్రం కదులుతోందని పేర్కొన్నారు. బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు..? బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. బనకచర్లపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అని హరీశ్‌రావు మండిపడ్డారు.
కృష్ణా జలాల విషయంలో సెక్షన్ 3ని సాధించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు సెక్షన్ 3పై ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్తే కనీసం కేవియట్ వేయరా..? అని నిలదీశారు . సాగునీటి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారన్నారు ఫైర్ అయ్యారు.. మేడిగడ్డను పండబెట్టారు.. పాలమూరును పక్కకు పెట్టారు. ఇప్పటికైనా నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. అఖిలపక్షం వేస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.