కృష్ణా జలాల విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ… ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీకి చెందిన ఓ రైతు పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా రైతు హౌస్‌మోషన్ పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జూన్ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీరు వదలటం వల్ల ఏపీకి నష్టం కలుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ సర్కారు తేల్చి చెబుతోన్న విషయం తెలిసిందే. అలాగే, తాము జల విద్యుదుత్పత్తిని కూడా ఆపబోమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు చేపట్టిందని చెబుతోంది. ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రాజెక్టుల పనులు జరుగుతూనే వున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఒక చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని, రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమ ప్రాజెక్టేనని ఆరోపించారు. జులై 9న నిర్వహించ తలపెట్టిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని రద్దు చేసి, జులై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించి, ఇకపై 50:50 నిష్పత్తిలో పంపకాలు చేయాలని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: జగన్ కేసుల్లో నిందితులకు హైకోర్టు షాక్