అంతులేని పక్కాప్లాన్
ఆ హతుడు ఎవ్వరు ?
శవాన్ని అప్పగించిన లేడీ కథేంటీ?
తులసీ మరిది ఎక్కడ ?
టెక్నాలజీకి దొరకని సిద్ధార్థ వర్మ జాడ
సూత్రధారుల కోసం పోలీసుల జల్లెడ
దర్యాప్తులో ఉన్నతాధికారులు సైతం బిజీబిజీ
ఆంధ్రప్రభ , భీమవరం – డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసు మిస్టరీ భీమవరం పోలీసులను ముప్పు తిప్పలు పెడుతోంది. డెడ్ బాడీ డెలివరీ ఇచ్చిన ఆటో డ్రైవరు దొరికాడు. పార్శిల్ తెరచిన అతిథి మాయమయ్యాడు. అసలు చెక్క పెట్టెను అప్పగించిన లేడీ జాడ దొరకలేదు. ఈ సారి క్రిమినల్స్ అన్ని కోణాల్లోనూ టెక్నాలజీతో ఆధారాలను మాయం చేస్తున్నారు. ఈ స్థితిలో..ఈ కేసు అతీగతీ తేలాంటే.. కొత్త ఇంటి ముందు ప్రత్యక్షమైన శవమే తన కథ చెప్పాలి. చావుకు కారణం ఏంటీ? ఎవరన్నా చంపేశారా? ఇంతకీ ఈ బాడీ ఎక్కడిది? తెలంగాణ వ్యక్తా? ఆంధ్రాకు చెందిన వ్యక్తా? . ఎవరు పంపారు? ఎందుకు పంపారు.. అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతున్నా.. ఒక్క క్లూ కూడా దొరకటం లేదు. హత్యకు సూత్రధారిగా ఓ మహిళ తెరమీదకు వచ్చింది. ఆమెకు యండగండి బాధితుల బంధువనే అనుమానాలు తెరమీదకు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో ప్రత్యక్షమైన ఈ డెడ్ బాడీ పార్శిల్ కేసులో ఆధారాల కోసం ఇటు ఏపీలో.. అటు తెలంగాణాలో నాలుగు భీమవరం పోలీసు బృందాల అన్వేషణ అంతం కాదిది ఆరంభం అనే రీతిలో సాగుతోంది. ఇక జిల్లా ఎస్పీ, డీఐజీ ఈ కేసు దర్యాప్తులో క్షణ క్షణం పర్యవేక్షిస్తున్నారు.
ఇంతకీ ఆ హతుడెవ్వరు?
ఉండి మండలం యండగండిలో ముదునూరు రంగరాజు పెద్ద కుమార్తె తులసీ నిర్మిస్తున్న కొత్త ఇంటికి పార్శిల్ వచ్చిన చెక్క పెట్టెలో మృతుడెవరనేది అంతుచిక్కడం లేదు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు ఏపీ, తెలంగాణలో గాలింపు చర్యలు చేపట్టారు. అతడి మృతుడి జాడ కోసం భీమవరం పోలీసులు జల్లెడ పడుడుతున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో..ఈ మృతదేహం ఎవరిదో గుర్తించే దిశగా అడుగులు వేస్తున్నారు. 35 నుంచి 45 ఏళ్ల మధ్య మెన్ మిస్సింగ్ అదృశ్యం కేసులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తులసి కుటుంబానికి మృతుడితో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంపై పోలీసులు దృష్టి సారించారు.
అంతులేని పక్కా ప్లాన్
చెక్క పెట్టెలో శవం కేసులో.. ఓ మహిళను ప్రధాన సూత్రధారిగా.. తులసి చెల్లి రేవతి భర్త సిద్ధార్థ వర్మ ( శ్రీధర్ వర్మ) ను యాక్షన్ ప్లాన్ సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు ముగ్గురు భార్యలట. మొదటి భార్య కాళ్ల గ్రామంలో ఉంటోంది. రెండో భార్య రేవతి. మొగల్తూరులో శ్రీధర్ వర్మతో ఉంటోంది. రేవతితో పెళ్లి ఫొటోలు మినహా.. ఇతర ఆధారాలు లేవు. ఇక మూడో భార్య హైదరాబాద్ లో ఉంటోందని సమాచారం. ఇక యండగండికి మృతదేహం చేరినప్పుడు చెక్కపెట్టే నుంచి వాసన వస్తోంది, త్వరగా రావాలని తులసీకి ఫోన్ చేసిన వ్యక్తి శ్రీధర్ వర్మే. తొలుత తులసీ ఎదుట చెక్కపెట్టెను తెరచిందీ అతడే. ఆ పెట్టె తులసీ ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే శ్రీధర్ వర్మ పరారయ్యాడు. అతడు కూడా ఎరుపు రంగు కారులోనే పారిపోయినట్టు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు చెక్కపెట్టెను పంపించిన మహిళతో శ్రీధర్‌వర్మకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్టున్నారు. చెక్కపెట్టేలో దొరికిన బెదిరింపు లేఖ దస్తూరి కూడా శ్రీధర్ వర్మదేనని పోలీసుల అనుమానం. అదే సమయంలో అతడు అదృశ్యం కావటంతో అనుమానం బలపడింది. యండగండి గ్రామానికి చెందిన ముదునూరి రంగరాజు- హైమావతికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి, ఓ భవనం, ఆస్తుల విషయంలో కుమార్తెలు తులసీ, రేవతి మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ ఆస్తిపై కన్నేసిన మరిదే.. వదిన తులసీని బెదిరించేందుకు ఈ ప్లాన్ రచించాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడు దొరికితే అసలు కథ వెలుగులోకి వస్తుందని, శ్రీధర్ వర్మను టార్గెట్ చేసి పోలీసులు వెతుకుతున్నారు. ఇక శ్రీధర్ వర్మ కూడా టెక్నాలజీకి అనుగుణంగా సిమ్ కార్డులు, సెల్‌ఫోన్లను మార్చేస్తున్నాడు.
ఇంతకీ ఆ లేడీ ఎవరు?
సీసీ పుటేజీలో దొరికిన ఆటోడ్రైవరు కథనం ప్రకారం, భీమవరం నుంచి తాడేపల్లిగూడెం రోడ్డులో సాగిపాడు వద్ద రెడ్ కలర్ కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది. అక్కడి నుంచే పిప్పరకు చెందిన ఆటోడ్రైవర్‌తో చెక్క పెట్టెను యండగండికి తీసుకెళ్లాలని కిరాయికి ఇచ్చి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె ఎక్కిన కారు ను గుర్తించేందుకు ప్రధాన రహదారులపై సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ మహిళను ఆటో డ్రైవరు గుర్తిస్తే మృతదేహం వివరాలు తెలుస్తాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఈ స్థితిలో తులసీ, రేవతిని పోలీసులు అనుమానించారు. అంతే సాగి తులసీ, ఆమె తల్లిదండ్రులు రంగరాజు, హైమావతి, సోదరి రేవతిని పోలీసులు విచారిస్తున్నారు. వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. సీసీ ఫుటేజీలో దొరికిన ఆటో డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక రేవతి భర్త శ్రీధర్ వర్మను హైదరాబాద్ లో పోలీసులు పట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేయించారు. చెక్క పెట్టెలో వచ్చిన మృతదేహానికి పోస్టుమార్టం చేసిన నివేదికను పరిశీలిస్తే అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి వెల్లడించారు.
హతుడి వివరాలు లభ్యం ….
డెడ్ బాడీ డెలివరీ కేసులో ప్రత్యక్షమైన మృతుడు కథ వెలుగులోకి వచ్చింది. అనుమానితుడు శ్రీధర్ వర్మ రెండవ భార్య ఊరికి చెందిన ఓ అనాథగా గుర్తించారు. అతడి పేరు బర్రె గర్లయ్య. రోజువారీ కూలీ. కాళ్ల గ్రామంలోనే ఉంటున్నాడు. అతడికి బంధువులెవరూ ఈ గ్రామంలో లేరు. గ్రామంలో ఏపని దొరికితే ఆ పనికి వెళ్తాడు. కూలీ డబ్బులతో ఖుషీగా తాగి .. ఎవరొకరి ఇళ్ల పంచల్లో నిద్రపోతాడు. ఊళ్లో పని లేకపోతే వేరే గ్రామానికి వెళ్తాడు. ఇటీవల శ్రీధర్ వర్మ ఇంటిలో తాపీ పనికి వెళ్లాడు. ఆ తరువాత గ్రామంలో కనిపించలేదు. శ్రీధర వర్మే అతడిని హతమార్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు.