హైదరాబాద్, ఆంధ్రప్రభ: కేసీ కెనాల్ (కర్నూలు, కడప కాలువ)కు కేటాయించిన జలాలను కేవలం సుంకేసుల ఆనకట్ట నుంచి మాత్రమే తరలించేలా ఏపీ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. నిబంధనలకు విరుద్ధంగా కేసీ కెనాల్‌కు ఏపీ ప్రభుత్వం… పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, నిప్పుల వాగు ఎస్కేప్ ఛానల్ తదితర మార్గాల ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసపింది. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ -1 (కేడబ్ల్యూటీ-1)కు వ్యతిరేకమని స్పష్టం కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో వెంటనే స్పందించి కృష్ణ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్న ప్రతీ చోట నీటి మీటర్లు ఏర్పాటు చేయాలని, ఏపీ ప్రభుత్వ జలచౌర్యాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేఆర్‌ఎంబీకి శనివారం తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ సీ. మురళీధర్ లేఖ రాశారు. వాస్తవానికి కేసీ కెనాల్‌కు కేటాయించిన జలాలు 10 టీఎంసీలేనని, కాని ఏపీ ప్రభుత్వం నీటి తరలింపును 39.9 టీఎంసీలకు పెంచుకుందని, అది కూడా కేసీ కెనాల్ ద్వారా కృష్ణా బేసిన్ ఆవల ప్రాంతాలకు నీటిని అక్రమంగా తరలిస్తోందని మండిపడ్డారు.
మొదటి నుంచి అంతరాష్ట్ర నీటి ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబందనల ప్రకారం సుంకేసుల జలాశయం నుంచి మాత్రమే నీటిని కేసీ కెనాల్‌కు నీటిని తరలించాల్సి ఉండగా… అక్రమంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తరలిస్తోందని లేఖలో ఈఎన్‌సీ ఏపీ తీరును ఎండగట్టారు. శ్రీశైలం రిజర్వాయర్ 885 అడుగల వద్ద పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి, 833 అడుగుల వద్ద హంద్రీనీవా ప్రాజెక్టులోని మల్యాల పంప్ హౌజ్ వద్ద నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి కేసీ కెనాల్‌కు తుంగ భద్ర నదీ నుంచి మాత్రమే నీటిని తరలించాలని, అంతేకాని కృష్ణా నది నుంచి నేరుగా నీటిని తరలించొద్దని కేడబ్ల్యూటీ-1 స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ద్వారా అక్రమంగా కేసీ కెనాల్‌కు నీటిని తరలించుకుపోతోందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా అంతరాష్ట్ర నీటి ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో ఇకనైనా కేఆర్‌ఎంబీ స్పందించి కేసీ కెనాల్‌కు నీటి తరలింపు విషయంలో అధ్యయనం చేయాలని ఈఎన్‌సీ డిమాండ్ చేశారు.