Friday, November 22, 2024

TG | విద్యాసంస్థలలో డ్రగ్స్‌ కట్టడికి ప్రహారీ కమిటీలు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : డ్రగ్‌ ఫ్రీ స్టేట్‌గా తెలంగాణను నిలిపే లక్ష్యంతో ముందుకు వెళుతున్న సీఎం రేవంత్‌రెడ్డి మరిన్ని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ అన్ని స్థాయిల్లో సమర్ధవంతంగా చేపట్టి సఫలమయ్యేలా చట్టాలకు పదును పెడుతూనే… తనదైన శైలిలో విద్యాసంస్థలపై దృష్టిసారించారు.

నిషేధిత మాదకద్రవ్యాల నియంత్రణలకు ఇప్పటికే ఏపీతో సమన్వయం చేసుకుంటూ పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులను ఈ కార్యంలో నిమగ్నం చేసిన ఆయన డ్రగ్‌ మూలాలపై దృష్టిసారించారు. అదే ఒరవడితో సప్లయ్‌తోపాటు, వినియోగంపై కూడా సమరశంఖం పూరించేందుకు సన్నద్ధమవుతున్నారు.

గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ పాఠశాలలు, కాలేజీలలో డ్రగ్స్‌ వినియోగం సంచనలం సృష్టించింది. విద్యాసంస్థలలో మత్తుపదార్ధాల వినియోగం కట్టడి విఫలమైందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కీలక చర్యలకు దిగుతోంది. రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ హైస్కూళ్లల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలు జరగకుండా, విద్యార్థులు వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్‌లు నిఘా పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలు జారీ చేశారు.

పిల్లలను మాదకద్రవ్యాల దుర్వినియోగం నుంచి దూరం చేయడానికి ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌ అధ్యక్షుడిగా హెడ్‌ మాస్టర్‌ లేదా ప్రిన్సిపాల్‌ ఉండనున్నాడు. వైస్‌ ప్రెసిడెంట్‌గా సీనియర్‌ టీచర్‌ లేదా ఫ్రెండ్లీ టీచర్‌ ఉంటారు.

- Advertisement -

6 నుంచి పదో తరగతి వరకు ప్రతి క్లాసులో ఇద్దరు విద్యార్థులు, స్థానికంగా ఉండే పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఒక పోలీస్‌.. పేరెంట్స్‌ నుంచి ఒకరు ప్రహరీ క్లబ్‌లో సభ్యులుగా ఉండనున్నారు. విద్య సంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరకుండా, విద్యార్థులు వాటి ఊబిలో చిక్కుకోకుండా అవసరమైన ప్రణాళికలను ప్రహరీ క్లబ్‌లు రూపొందిస్తాయి. విద్య, శిశు సంరక్షణ సంస్థల పరిసరాల్లో మాదకద్రవ్యాల విక్రయాలపై ఫోకస్‌ పెట్టనున్నారు.

విద్యార్ధులు, చిన్నారులు తెలిసీ తెలియక ఈ ఊబిలో చిక్కుకొని మత్తుపదార్ధాలుగా ఔషధా మందులు, ఇతర పదార్ధాలు, నిషేధిత డ్రగ్స్‌ను సేవించకుండా ఈ క్లబ్‌లు పాటుపడనున్నాయి. త్వరలో ఈ క్లబ్‌ల ఏర్పాటుకు విధివిధానాలు ఖరారు చేయనున్నారు. హైదరాబాద్‌, సౌబరాబాద్‌, రాజకొండ కమిషనరేట్‌ పరిధిలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement