Friday, November 22, 2024

‘మేగా’కు మరో ప్రాజెక్టు.. 786 కోట్లతో హైదరాబాద్‌- బీజాపూర్‌ రోడ్డు పనులు

ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి : హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారి విస్తరణకు సంబంధించిన పనులు ఒకొక్కటిగా ముందుకుసాగుతున్నాయి.. ప్రధానమైన టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ప్రపంచంలో పేరుగడించిన కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి శభాష్‌ అనిపించుకున్న మెగా సంస్థ రోడ్డు నిర్మాణ హక్కులను సంపాధించుకుంది. ఎలాంటి నిర్మాణ బాధ్యతలు అప్పగించిన సకాలంలో పూర్తి చేస్తారనే నమ్మకం మెగా సంస్థకు ఉంది. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి కూడా మెగా సంస్థపై ప్రశంసలు కురిపించారు. మెగా సంస్థపై నమ్మకం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్పా- మన్నెగూడ రోడ్డు నిర్మాణం అనుకున్న గడువు లోపే పూర్తి అవుతుందనే నమ్మకం ఏర్పడింది…రోడ్డు నిర్మాణానికి రూ. 786కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే…భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తరువాతే సంబంధిత అధికారులు రంగంలో దిగనున్నారు..

పెరుగున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌- బీజాపూర్‌ రోడ్డును నాలుగు వరుసల రోడ్డుగా మార్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. అందులో భాగంగానే అప్పా జంక్షన్‌ నుండి మన్నెగూడ చౌరస్తా వరకు రోడ్డు నిర్మాణంతోపాటు అండర్‌పాస్‌లు, భూసేకరణకు గాను రూ. 956కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో 46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 786కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ రోడ్డు నిర్మాణ హక్కులు మెగా సంస్థ చేజిక్కించుకుంది. పెద్ద ప్రాజెక్టుగా పేరున్న కాళేశ్వరం ప్రాజెక్టును మెగా సంస్థ అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేసింది. తాజాగా రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో కీలక ప్రాజెక్టు ఆ సంస్థకే దక్కింది. దీంతో రోడ్డు నిర్మాణం సకాలంలో పూర్తి అవుతుందనే నమ్మకం ఏర్పడింది.మెగా సంస్థకు జాతీయ స్థాయిలో పేరుంది. ఇటీవల కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరి కూడా మెగా సంస్థపై ప్రశంసల జల్లు కురిపించారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో చేపట్టిన భారీ ప్రాజెక్టు మెగా సంస్థకు దక్కడంతో సకాలంలో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అవుతారనే నమ్మకం ఏర్పడింది…..టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో మరో రెండుమూడు మాసాల్లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

80 శాతం మేర భూసేకరణ పూర్తి..
46 కిలోమీటర్ల మేర నిర్మించనున్న నాలుగువరుసల రోడ్డు నిర్మాణానికి కావల్సిన భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 80 శాతం మేర భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. భూములు కోల్పొతున్న వారికి ఎంతమేర పరిహారం ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవల్సి ఉంది. భూములు పోయిన వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసిన తరువాతే సంబంధిత అధికారులు రంగంలో దిగనున్నారు. ప్రక్రియ అంతర్గతంగా జరుగుతోంది. పోలీస్‌ అకాడమీ నుండి మన్నెగూడ చౌరస్తా వరకు భూములు సేకరించాల్సి ఉంది. ఇందులో పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూములు…అటవీ భూములు సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములకు సంబంధించి ఇబ్బంది లేకపోయినప్పటికీ పట్టా భూములకు సంబంధించి కొంతమేర ఇబ్బందులు తప్పేట్లు లేవు. వారిని ఒప్పించి భూములు సేకరించాల్సి ఉంటుంది…అసైన్డ్‌ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా పరిహారం చెల్లించనున్నారు. మొత్తం మీద ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. త్వరలోనే సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులతోపాటు భూములు కోల్పొతున్న వారితో సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొయినాబాద్‌ వద్ద 100 మీటర్ల అండర్‌పాస్‌..
46 కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 18 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఇందులో మొయినాబాద్‌ వద్ద పెద్ద అండర్‌పాస్‌ ఏర్పాటు చేయబోతున్నారు. 100 మీటర్లమేర నిర్మించనున్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అండర్‌పాస్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధాన చౌరస్తాలు తగలకుండా రోడ్డు నిర్మాణాలను చేపట్టనున్న విషయం తెలిసిందే. 18 అండగ్‌పాసుల్లో మొయినాబాద్‌ వద్ద నిర్మించేది పెద్దది కావడం గమనార్హం..

మర్రి చెట్లు రీలొకేటింగ్‌..
అప్పా జంక్షన్‌ నుండి మన్నెగూడ వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణలో వేలాది మర్రి చెట్లను తొలగించాల్సి ఉంటుంది. తొలగించిన మర్రి చెట్లు మరో ప్రాంతంలో తిరిగి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. చాలా సంవత్సరాల క్రితం మర్రి చెట్లు ఏర్పాటు చేశారు. చెట్లు ఏపుగా పెరిగాయి. వీటిని తొలగించి రోడ్డు నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుంది. తొలగించిన చెట్లను సురక్షితంగా మరో ప్రాంతంలో నాటేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో నేషనల్‌ హైవేస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది.

- Advertisement -

రోడ్డు నిర్మాణం తరువాత టోల్‌?
పెద్దపెద్ద రోడ్లు నిర్మించిన తరువాత టోల్‌గేట్లు ఏర్పాట్లు చేయడం పరిపాటే. హైదరాబాద్‌- బీజాపూర్‌ రోడ్డు విస్తరణలో భాగంగా అప్పా జంక్షన్‌ నుండి మన్నెగూడ వరకు మధ్యలో టోల్‌గేట్లు ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. టోల్‌ఏర్పాటు చేసి వాహనదారులనుండి డబ్బులు వసూలు చేయనున్నారు. ప్రధాన రోడ్ల నిర్మాణం తరువాత టోల్‌గేట్లు ఏర్పాటు చేయడం జరుగుతోంది.

రోడ్డు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి: చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి
అప్పా జంక్షన్‌ నుండి మన్నెగూడ వరకు చేపట్టనున్న నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లను మెగా సంస్థ దక్కించుకోవడంతో సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేస్తారనే నమ్మకం ఏర్పడింది. దేశంలో అనేక పెద్ద ప్రాజెక్టులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి సంస్థ శభాష్‌ అనిపించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసిన ఘనత మెగా సంస్థకే దక్కుతుంది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో భారీ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. తనను ఎంపీగా గెలిపించిన పార్లమెంట్‌ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సకాలంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమై సకాలంలో పూర్తి చేసేలా కృషి చేస్తా.

Advertisement

తాజా వార్తలు

Advertisement