నందిగామ, ఆగస్టు 15 (ప్రభ న్యూస్): ఎందరో మహనీయులు ప్రాణ త్యాగం ఫలితంగా సాధించుకున్న స్వాతంత్రం భారతీయులకు అత్యంత ప్రత్యేకం. భారతీయులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకుంటూ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాంటి తివర్ణ పతకానికి నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద అవమానం చోటు చేసుకుంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నందిగామ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగుర వేసి జాతీయ జెండాను అవమాన పరిచారు. జాతీయ జెండాను తలకిందులుగా చేసి కట్టిన అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తహసీల్దార్ అయ్యప్ప తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చవిచూసినా అధికారుల నిర్లక్ష్య వైఖరి మారలేదని, ముచ్చటగా మూడోవసారి తహశీల్ధార్ కార్యాలయం వద్ద జాతీయ జెండా తలకిందులై దర్శనమిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హమని, అధికారులపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మండల ప్రజలను నిర్ధేశించే మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదుష్టకరమని వాపోతున్నారు.