హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇప్పటికే చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కు ఉన్న యాదాద్రి భువనగరి జిల్లా దండు మల్కాపూర్ పారిశ్రామిక వాడలో మరో అత్యాధునిక ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన పార్కును ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఏకంగా 16 లక్షల స్క్వేర్ ఫీట్లలో 8 మీటర్ల ఎత్తులో ఇండస్ట్రియల్ యూనిట్ల షెడ్లను అభివృద్ధి చేయాలని పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. దండు మల్కాపూర్‌లో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కేటాయించినది కాకుండా 75 ఎకరాల భూమి ఖాళీగా అందుబాటులో ఉంది. దీనిలో నూతన పార్కును అభివృద్ధి చేసి నూతనంగా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు నేరుగా ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా సకల మౌళిక సదుపాయాలు కల్పించడానికి పరిశ్రమల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నూతన పార్కు అభివృద్ధికి ఆసక్తి ఉన్న బిడ్డర్ కంపెనీలు బిడ్లు దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) టెండర్లు ఆహ్వానించింది. కొత్త పారిశ్రామిక పార్కు అభివృద్ధికిగాను దండు మల్కాపూర్ పారిశ్రామిక వాడలో ఖాళీగా ఉన్న 75 ఎకరాల భూమిని ఏకంగా విక్రయించేందుకు సిద్ధమని తెలిపింది. ఈ భూమి కొనుగోలుకు సంబంధించి బిడ్ వేయడంతో పాటు నూతన పారిశ్రామిక పార్కు అభివృద్ధికి సంబంధించిన డీటేయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను సమర్పించాల్సి ఉంటుందని టీఎస్ఐఐసీ టెండర్ నోటిఫికేషన్లో తెలిపింది. టెండర్లు దాఖలు చేయడానికి ఈ నెల 11వ తేదీ ఆఖరు తేదీగా టీఎస్ఐఐసీ ప్రకటించింది. అయితే భూమి కొనుగోలు చేసే బిడ్డర్లపై ఇటు భూమి ధరతో పాటు అభివృద్ధి ఖర్చుల భారం పడకుండా దశలవారిగా పార్కు అభివృద్ధి పూర్తవుతున్న కొద్దీ భూమి ధరకు ఏడాదికి 4 శాతం వడ్డీని కలిపి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నట్లు టీఎస్ఐఐసీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంపికైన బిడ్డరు ముందుగా బ్యాంకు గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. పార్కు అభివృద్ధి ప్రారంభమైన తర్వాత వాటాను పూర్తిస్థాయిలో విక్రయించకుండా టీఎస్ఐఐసీ విధించిన నిబంధనలపై ప్రాస్పెక్టివ్ బిడ్డర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి ప్రారంభించిన తర్వాత 5 సంవత్సరాల్లో కనీసం 51 శాతం ఈక్విటీని విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ పార్కు…
మొత్తం 427 ఎకరాల్లో విస్తరించి ఉన్న దండుమల్కాపూర్ చిన్న పరిశ్రమల పార్కు దక్షిణ భారతంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. 2019లో ప్రారంభించిన తొలిదశ పార్కును తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్(టీఐఎఫ్) అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ 120 దాకా పారిశ్రామిక యూనిట్లు తమ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ పార్కు అభివృద్ధి చేసిన తీరును అధ్యయనం చేయడానికిగాను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్ణ(ఏపీఐఐసీ) ప్రతినిధులు కూడా వచ్చి సందర్శించడం విశేషం. ఇక్కడ వాక్ టు వర్క్ పద్ధతిన ఉద్యోగులకు అనువుగా ఉండేందుకు నివాస సముదాయాలు, స్కూళ్లు, ఆస్పత్రులను నిర్మించతలబెట్టారు. పార్కు పూర్తిస్థాయి అభివృద్ధి పూర్తయిన తర్వాత ఇక్కడ కనీసం 20 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.