Friday, November 22, 2024

TS : ప్రాణహిత తీరంలో…. ప్రాణాలు గుప్పిట్లో.. శివలెత్తిన గజరాజు…ముగ్గురు రైతుల మృతి..

అదిలాబాద్ అడవుల జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి…
ఏనుగుల సమాచారం తెలిసినా…
పెడచెవిన పెట్టిన అటవీ అధికారులు..
గాలింపు చర్యలు ముమ్మరం..
నాలుగు మండలాల్లో నిషేదాజ్ఞలు

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో/ చింతలమానేపల్లి (ప్రభ న్యూస్)
నిన్న మొన్నటి వరకు… పెద్దపులుల భయంతో వనికిపోయిన అటవీ పల్లెలు .. ఇప్పుడు గజరాజుల ఉగ్రరూపానికి అల్లాడిపోతున్నాయి. కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో 24 గంటల వ్యవధిలోనే మహారాష్ట్ర ప్రాణహిత తీరం దాటి వచ్చిన మగ ఏనుగు ముగ్గురు రైతులను మట్టుబెట్టిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర గడిచిరోలి జిల్లాలో ఏనుగుల గుంపు నుండి విడిపోయి ఒక ఏనుగు ప్రాణహిత దాటి చింతల మానేపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో సంచరిస్తున్నట్టు ప్రజలకు సమాచారం అంది. మహారాష్ట్ర అటవీ అధికారులు సైతం ముందస్తుగా హెచ్చరికలతో తెలంగాణ అటవీ అధికారులకు సమాచారం అందించారు. పెద్ద పులులు తిరిగే ఈ ప్రాంతంలో ఏనుగులు ఎప్పుడు చూడలేదని ఇవి వదంతులేనని కొట్టిపారేశారు.

ముగ్గురు రైతుల మృతి…

బుధవారం సాయంత్రం చింతల మానేపల్లి మండలం బూరేపల్లి గ్రామ సమీపంలో ఏనుగు దాడిలో శంకర్ అనే రైతు మృతి చెందగా, గురువారం ఉదయం పెంచికల్పేట్ మండలం కొండాపూర్ గ్రామ శివారులో తారుపోషన్న (50) పై ఇదే ఏనుగు దాడి చేసి హతమార్చింది. పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య(50)అనే రైతు గురువారం ఉదయం కరెంటు మోటర్ వేయడానికి పొలానికి వెళ్తుండగా ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రెండు ప్రాణాలు బలి అయ్యాయి. మొన్నటివరకు మహారాష్ట్ర ప్రాణహిత తీరం దాటి పెద్దపులు లు ప్రవేశించి పశువులు, మనుషులపై దాడి చేసి మట్టుపెట్టిన ఘటనలు చూశాం. కానీ అదిలాబాద్ అడవుల జిల్లాలో ఏనుగులు ప్రవేశించి రైతులను మట్టు పెడుతున్న ఘటనలు సర్వత్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. అటవీ అధికారుల ఏమరుపాటు వల్ల వన్యమృగాల దాటికినిండు ప్రాణాలు బలి అవుతున్నాయి.

రెండు రోజుల క్రితమే ఏనుగుల గుంపు హల్ చల్
ప్రణీత తీరం ఆవల మహారాష్ట్ర గడిచిరోలి జిల్లాలో ఏనుగుల గుంపు రెండు రోజుల క్రితమే ప్రవేశించినట్టు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. 30 ఏళ్ల వయసున్న మగ ఏనుగు దారి తప్పి తెలంగాణకు వచ్చినట్టు ముందస్తు సమాచారం కూడా ఇచ్చారు. అయినా మన అడవి శాఖ అధికారులు పెడచెవిన పెట్టడంతో ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన అటవీ శాఖలో అలజడి రేపుతోంది..

గాలింపు చర్యలు ముమ్మరం… నిషేధాజ్ఞలు
పి సి సి ఎఫ్ ఆదేశాల మేరకు గురువారం సి ఎఫ్ ఓ శాంతారామ్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్, 30 మంది సభ్యులు గల ట్రాకింగ్ టీం మగ ఏనుగు ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏనుగులు ప్రవేశించాయన్న వార్త ప్రతి పల్లెలోనూ కంటికి కునుకు లేకుండా చేస్తోంది. రాత్రంతా ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు ఎక్కడినుండి ఏనుగు వస్తుందో నన్ను భయంతో గస్తీ చేపట్టారు. అటవీ, పోలీస్ అధికారులు మాత్రం భయపడవద్దని ఏనుగు ను మహారాష్ట్ర తీరం వెంబడి దాటించేలా చూస్తామని భరోసా ఇస్తున్నారు.

నాలుగు మండలాల్లో 144 నిషేదాజ్ఞలు
ఏనుగు దాడిలో ఇద్దరు రైతుల మృతి అనంతరం గురువారం మధ్యాహ్నం నుండి నాలుగు మండలాల్లో నిషేధ ఆజ్ఞలు విధించారు. ప్రజలు పంటచెల్లోకి వెళ్ళవద్దని, నలుగురు కలిసి గుంపుగా బయటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. బెజ్జూర్, కౌటాల, చింతల మానేపల్లి, పెంచికల్పేట్ మండలాల్లోని 70 గ్రామాల పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. అటవీ పోలీస్ అధికారులు ఉమ్మడిగా ట్రాకింగ్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తో ఏనుగు కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement