- రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేస్తాం
- వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు
- పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు
- మొక్కులు చెల్లించుకున్న మంత్రి
- నిత్యాన్నదానానికి రూ.40 లక్షలు ప్రకటించిన మంత్రి
- రూ.100కోట్లు విరాళ సేకరణకు లక్ష్యం
- డోనర్స్ ముందుకు రావాలని పొన్నం పిలుపు
వేములవాడ, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌లు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. విప్ ఆది శ్రీనివాస్ తోపాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్య అన్నదాన సత్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి రూ. 35 కోట్లను మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని చెప్పారు. అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అన్నదాన నిరంతరం కొనసాగడానికి ట్రస్ట్ లో ఇప్పటికే రూ. 20 కోట్లు ఉన్నాయని, దానిని వంద కోట్లు చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది, అలాగే ఈ ప్రాంత ప్రజలది అన్నారు.
రూ.40 లక్షలు విరాళం ప్రకటించిన మంత్రి…
నిత్యాన్నదానానికి తమ కుటుంబం తరుఫున రూ. 40 లక్షలను విరాళంగా ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రకటించారు. రాజరాజశ్వర స్వామి భక్తులు కూడా విరాళం ఇవ్వాలని కోరారు. దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో రశీదులు తీసుకొని విరాళాలు ఇవ్వాలని సూచించారుర. స్థానిక ఎమ్మెల్యేలు, ఈవోనీ కలిసి విరాళాలు ఇవ్వొచ్చు అని తెలిపారు. వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్ కి సంబంధించి విరాళాలు ఏవి ఇచ్చిన సరే.. రైతులు బియ్యం, కూరగాయలు కూడా ఇవ్వొచ్చు అని ఆయన తెలిపారు. తాము హైదరాబాద్ లో డోనర్స్ ను కలుస్తామన్నారు. వేములవాడ దర్శనంలో కోడె టికెట్, అభిషేకం టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నామన్నారు.
టీటీడీలా…
టీటీడీ దేవస్థానం మాదిరిలా అందరికీ టికెట్ తీసుకుని ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు మంత్రి అన్నారు. శ్రీశైలంలో ఉన్నట్లే మ్యూజికల్ ఫౌంటెన్ వేములవాడలో లార్డ్ శివ ఉండేలా చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు అధికారులు ప్రముఖులకు ఆశీర్వచనం గావించి స్వామివారి చిత్రపటం, మహాప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. వారి వెంట ఆలయ అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.