నిజామాబాద్ ప్రతినిధి, జనవరి 2 (ఆంధ్రప్రభ) : అన్ని దానాల్లో కంటే అన్నదానం మహాదానమని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ అన్నారు. శబరిమల లో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఇందూరు అయ్యప్ప స్వా ముల సహకారం అందించడం అభినందనీయమని కొనియాడారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో శబరిమలలో నిర్వహించే అన్నదానానికి సంబంధించిన సామాగ్రి వాహనం నాందేవాడ ఛత్రపతి హనుమాన్ ఆలయం నుండి శబరికి బయలుదేరుతున్న వాహనాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో శబరిమల నిలకల్ ప్రాంతంలో జనవరి 7తేదీ నుండి 14తేదీ వరకు నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమానికి ఇందూర్ నగర శాఖ ఆధ్వర్యంలో 101క్వింటాళ్ల బియ్యం, పప్పుదినుసులు, నూనె, మొత్తం దాదాపు రూ.9లక్షల విలువైన వంట సామాగ్రి వాహనాన్ని శబరికి పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి, ఆగమయ్య గురుస్వామి, గంగరత్నం గురుస్వామి, రవిస్వామి, పార్శి రాజు స్వామి, శ్రీనివాస్ స్వామి, పాల్గొన్నారు.