ప్రైవేట్ హాస్పిటళ్ల తనిఖీ
నిబంధనల ప్రకారం లేని ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు
గుర్తింపులేని ఆసుపత్రులను గుర్తించి, నోటీసులు జారీ
ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : ఆంధ్రప్రభలో ప్రచురితమైన డోల్ల దావాఖానాలు, అనుమతుల్లేని ఆసుపత్రులెన్నో అనే కథనానికి జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్, కరీంనగర్ ఆదేశానుసారం, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, కరీంనగర్ వైద్య బృందం జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ను తనిఖీ చేసి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆక్ట్ ప్రకారం, బయోమెడికల్ వెస్ట్ మేనేజ్ మెంట్, ఇతర పత్రాలను చూడడం జరిగిందని, డా.సుజాత, కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు (అల్లోపతీ, అయూష్, యూనాని, సిద్ధ) తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డా.సుజాత, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, కరీంనగర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 2010 నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్లు తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ధరల పట్టిక బోర్డులను ప్రధార్శించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో డాక్టర్ల వివరాలు, సిబ్బంది వివరాల్ని ప్రదర్శించాలని తెలిపారు.
రిజిస్ట్రేషన్ కోసం ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్ నో అబ్జెక్షన్ సెర్టిఫికట్, బయోమెడికల్ వెస్ట్ మేనేజ్ మెంట్, మున్సిపాలీటీ రూల్స్ నియమ, నిబందనలను పాటించాలి. అన్నీ ఆసుపత్రులు వ్యర్దాలను బయోమెడికల్ వెస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం, జిల్లాలో ప్రభుత్వంతో ఒప్పందం అయిన ఇన్సినేటర్స్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఒప్పందం ప్రకారం, శాస్త్రీయ పద్దతిలో వ్యర్దాలను తొలగిస్తారు. నిబంధనల ప్రకారం లేని ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్లపై తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గుర్తింపులేని ఆసుపత్రులను గుర్తించి, వారికి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.