Friday, November 22, 2024

Andhra Prabha Effect – సోయా కొనుగోళ్లపై నిబంధనల సడలింపు

ఎకరాకు 8 క్వింటాళ్ల కొనుగోళ్ల‌ పరిమితి పెంపు
మార్క్​ఫెడ్​, వ్యవసాయ శాఖ అంగీకారం
నాఫెడ్ సాఫ్ట్​వేర్​ అప్డేట్ కోసం కేంద్రానికి సిఫారసు
ఆనందంలో రైతులు

ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో సోయా పంట ధాన్యాన్ని విక్రయించే రైతులపై ఆంక్షలు, నిబంధనలు సడలించేలా వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించిన సోయాబీన్ ధాన్యాన్ని ప్రస్తుతం ఎకరాకు 6.52 క్వింటాళ్ల పరిమితి చొప్పున మార్క్ ఫెడ్ ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేస్తుంది. ఇకపై 8 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ సమ్మతించింది. సర్కారు నిబంధనలతో సోయాబీన్ రైతులు ప్రైవేట్ దళారుల వైపు మొగ్గుచూపుతూ అనేక కష్టనష్టాలకు గురవుతున్నారు.

ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన మంత్రి తుమ్మల
సోయా రైతులకు ఎదురవుతున్న ఇక్కట్లపై ‘ఆంధ్రప్రభ’ మెయిన్ ఎడిషన్​లో ‘సర్కారు ఆంక్షలతో సోయా రైతుకు నిరాశే..’ అనే శీర్షికన ప్రచురితమైన కథనం పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. మార్క్ ఫెడ్ నిబంధనల వల్ల సోయాబీన్ రైతులు ప్రైవేట్ దళారులను ఆశ్రయించి గిట్టుబాటు ధర అందక, తూకంలో కోతలతో మోసపోతున్నట్టు గుర్తించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం సోయా రైతులకు ఆంక్షలు విధించడం గురించి మంత్రి తుమ్మలతో విన్నవించారు. ప్రస్తుతం ఉన్న ఎకరాకు 6.52 క్వింటాళ్ల పరిమితిని 10 క్వింటాళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మార్క్​ఫెడ్​, నాఫెడ్ అధికారులతో మంత్రి తుమ్మల చర్చించి వ్యవసాయ శాఖ సిఫారసు మేరకు ఎకరా పరిమితి 6.52 క్వింటాల నుండి 8 క్వింటాళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాఫెడ్ సంస్థకు తూకం, ఆన్లైన్ సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం నివేదించారు. సోమవారం నుండి ఆంక్షల పరిమితులు సడలించేలా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

సర్కారు నిర్ణయంతో దళారులకు చెక్
సోయా కొనుగోళ్లపై పరిమితులు సడలించడంపై రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేయగా, ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా 2.10 లక్షల ఎకరాల్లో సోయా పంట సాగయ్యింది. ఎకరాకు 8 నుండి 9 క్వింటాళ్ల సగటు దిగుబడి వచ్చింది. మార్కెట్లో ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,892 నిర్ణయించగా, ప్రైవేట్ లో దళారులు రూ. 3900 నుంచి రూ.4100 వరకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టాలపాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 18 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 2.65 లక్షల మెట్రిక్ టన్నుల సోయా పంట ఉత్పత్తులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం నాఫెడ్ ద్వారా 25 శాతం అంటే 56,650 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలుకు అంగీకరించింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఇప్పటివరకు 11వేల క్వింటాళ్ల సోయాబీన్ కొనుగోలు చేశారు. కాగా ప్రభుత్వం రైతు సాగు చేసే పాసుపుస్తకం ఆధారంగా ఎకరాకు 6.52 క్వింటాళ్ల కొనుగోలు పరిమితి నుంచి 8 క్వింటాళ్లకు పెంచడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రవాణా భారం తప్పిందని ఎకరాకు 10 క్వింటాళ్లు పెంచినా తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement