ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం అందెవెల్లి వద్ద పెద్దవాగులో నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకు పోయింది. కెరమెరి, జైనూర్, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్దవాగులో నీటి ప్రవాహం పెరిగింది. ఆదివారం ఒక్కసారిగా వరద ఉధృతి పెరడంతో కాగజ్‌నగర్-దహేగాం మధ్య నిర్మాణంలో ఉన్న అందె వెల్లి బ్రిడ్జి కింది భాగంలో తాత్కలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో కాగజ్‌నగర్ నుండి దహేగాం, భీమిని మండలాలకు సుమారు 55 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
ఇది మూడోసారి..
రెండేళ్ల క్రితం అందవెల్లి బ్రిడ్జ్ కూలిపోవడంతో రూ. 12 కోట్ల వ్యయంతో చేపట్టిన అందేవెల్లి వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రాకపోకలకు ఇబ్బందుల లేకుండా పక్కన తాత్కాలిక వంతెనను నిర్మించారు. ఈ వంతెన కొట్టుకుపోవడంతో ఇది మూడోసారి.
65 కిలోమీటర్ల పెరిగిన దూరం..
అందేవెల్లి వంతెన కొట్టుకుపోవడంతో దహేగాం మండలానికి బాహ్య సంబంధాలు తెగిపోయాయి. సుమారు 30 గ్రామాల ప్రజలు కాగజ్నగర్ వెళ్లాలంటే మంచిర్యాల జిల్లా భీమిని, బెల్లంపల్లి మీదుగా 65 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
వంతెన పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే
పెద్దవాగు వద్ద కొట్టుకుపోయిన వంతెనను ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు పరిశీలించారు. పరిస్థితిపై ఇంజనీర్లతో ఆయన సమీక్షించారు. 55 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయినందున యుద్ధ ప్రాతిపదికన అప్రోచ్ వంతెన నిర్మాణం పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.