నిజామాబాద్ బ్యూరో, (ప్రభన్యూస్) : 2021-2023 సంవత్సరానికి సంబంధించిన మద్యం విధానానికి ఈపాటికే ఖరారు చేసిన ప్రభుత్వం సోమవారం నుంచి మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియను మొదలుపెట్టబోతుంది. ఈ మేరకు అన్ని జిల్లాలో ఎక్సైజ్ అధికారులకు కొత్త మద్యం పాలసీకి సంబంధించి గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మద్యం దుకాణాల కేటాయింపులోనూ రిజర్వేషన్‌ల అమలుకు శ్రీకారం చుట్టింది.
సోమవారం మద్యం షాపులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలతో పాటు గౌడ కులస్తులకు కేటాయింపుల ప్రక్రియ జిల్లా కలెక్టర్ సమక్షంలో ఆయా సంక్షేమ శాఖల అధికారులతో కలిసి ఎక్సైజ్ శాఖ లాటరీ పద్దతిలో ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు మద్యం షాపులు కేటాయించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 91 మద్యం దుకాణాలు ఉండగా ఈసారి కొత్తగా 11 దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాలో ఈసారి 102 మద్యం దుకాణాలు ఏర్పాటు కాబోతున్నాయి.
ఇందులో 30 శాతం మేరకు దుకాణాలు రిజర్వు చేస్తారు. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాల లావాదేవిలు మొదలుకానున్నాయి. అయితే ఈసారి కొత్త మద్యం విధానం విషయంలో వ్యాపారులు ఆశాజనకంగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం వ్యాపారులకు అనుకూలంగా ఉందనే చర్చ జరుగుతుంది. దరఖాస్తు ఫీజులు రెండింతలు చేసినప్పటికీ ఈసారి పోటీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన నియామకాల ప్రకారం లాటరీ ద్వారా ఖరారు చేయడంతో పాటు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడానికి జిల్లా ఎక్సైజ్ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో రెండు జిల్లాలకు చెందిన అధికారులు ఆదివారం సుదీర్ఘ కసరత్తు చేశారు. కామారెడ్డి జిల్లాలోనూ 40 షాప్‌లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. కామారెడ్డి జిల్లాలో కొత్త మద్యం షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో పాత దుకాణాలకే లాటరీ ద్వారా కేటాయించనున్నారు. మొత్తం మద్యం దుకాణాల్లో 30 శాతం రిజర్వు కాబోతున్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సోమవారం పూర్తయ్యాకా మంగళవారం నుంచి ఈ నెల 16 వరకు మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు.
ఇది కూడా చదవండి:Breaking: చెన్నైకి రెడ్ అలర్ట్.. 48 గంటల్లో మహా వాయు‘గండం’..
ఈ నెల 18న లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు. గతంలో లక్ష రూపాయలున్న దరఖాస్తు ఫాంను ఈసారి రెండు లక్షల రూపాయలు చేసారు. అలాగే జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజు ఖరారు చేయనున్నారు. గతంలో 4 స్లాబ్‌లుంటే ఈసారి 6 స్లాబ్‌లుగా లైసెన్స్ ఫీజును ఖరారు చేసింది. అలాగే ఒక్కరు ఎన్ని మద్యం షాపుల కోసమైన దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మద్యం అమ్మకాల్లో వచ్చే లాభాల్లో నిబంధనలు సైతం సడలించారు. అలాగే పర్మిట్ రూంల విషయంలో ఇది వరకున్న విధానమే అమలు చేయనున్నారు.