Wednesday, January 8, 2025

TG | ఇక ఆరాంసే ఛలో ఛలో.. సీఎం చేతుల మీదుగా కొత్త ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అరాంఘర్ – జూపార్క్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి హాజరయ్యారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌డీపీ)లో భాగంగా ఆరాంఘర్ నుంచి జూపార్క్‌‌‌‌ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్​పనులు 2021లో ప్రారంభమైనప్పటికీ పలు కారణాల వల్ల ప్రారంభానికి జాప్యం జరుగుతూ వచ్చింది.

దీని అంచనా వ్యయం రూ.636.80 కోట్లు అయినప్పటికీ పనులు పూర్తయ్యే సరికి ఖర్చు రూ.799 కోట్లకు చేరింది. ఈ ఫ్లైఓవర్ ను 24 మీటర్ల వెడల్పు, ఆరు లేన్లతో 4.08 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే జూపార్క్ నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్, మహబూబ్‌‌‌‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరుకు రాకపోకలు సాఫీగా సాగుతాయి. అలాగే ప్రస్తుతమున్న తాడ్​బన్, దానమ్మహట్స్, హసన్ నగర్ జంక్షన్ల లోని ట్రాఫిక్ సిగ్నళ్లు వద్ద ఎక్కడా ఆగకుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలుంటుంది.

జూపార్క్‌‌‌‌కు వచ్చే సందర్శకులకు, పాతబస్తీ వైపు వెళ్లే వాహనాలకు ప్రయాణం ఈజీ అవడంతోపాటు, సమయం ఆదా కానుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత హైదరాబాద్​లో నిర్మించిన అత్యధిక పొడవైన ఫ్లైఓవర్ గా దీన్ని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో పీవీ నరసింహారావు ఎక్స్‌‌‌‌ప్రెస్ వే 2009లో అందుబాటులోకి వచ్చింది. ఇది11.66 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లతో నిర్మించారు.

- Advertisement -

అప్పట్లో ఎయిర్ పోర్టుకి వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు దీన్ని ఫ్లైఓవర్ ని నిర్మించారు. ఆ తరువాత 3 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్లతో కొత్తగూడ ఫ్లైఓవర్ నిర్మించారు. అయితే ఇప్పుడు ఆరాంఘర్ ఫ్లైఓవర్ 4.08 కిలోమీటర్ల పొడవుతో 6లేన్లలో అందుబాటులో వస్తుంది. ప్రస్తుతం సిటీలో అతిపెద్ద రెండో ఫ్లైఓవర్ ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement