Saturday, November 23, 2024

గోదారి తీరంలో పురాతన ఆలయాలు.. గతంలో బయటపడిన శివలింగాలు..

పోలవరం, ప్రభన్యూస్‌: గోదావరి తీరం అణువణువు పరమపవిత్రం. తీరం వెంబడి శతాబ్దాల క్రితం నిర్మించిన శివాలయాలు, శివలింగాలు, పురాతన వస్తువులు తవుతున్నకొద్దీ బయటపడుతూనే ఉంటాయి. అందుకేనేమో గోదావరి ప్రాంత ప్రజలకు భక్తి ఎక్కువ. పట్టిసీమ నుంచి గోదావరి మధ్యలో గల కొండపైనున్న మహానందీశ్వర స్వామి ఆలయం శతాబ్దాల క్రితం నుంచి ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఎగువ ఏజెన్సీ గ్రామాలైన పైడిపాక ,సింగన్నపల్లి, తుటిగుంట, చిడూరు, సివగిరీలలో వందల ఏళ్ల నాటి శివలింగాలు తవ్వకాలలో వెలికి వస్తున్నాయి. చరిత్ర నేపథ్యం ప్రకారం చోళ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. చోళులు శైవులు శివారధకులు. అందువలన గోదావరి పరివాహక ప్రాంతాలలో ఆలయాలు నిర్మించారు. అందులో శివలింగాలను ఏర్పాటు చేశారు.

తరువాత వచ్చిన కాకతీయ రాజులు, రెడ్డి రాజులు కూడా శివరాధికులు,శైవులు అవడంతో ప్రశాంతంగా ఉండే గోదావరి తీరం వెంబడి పురాతన శివాలయం అంటున్న ఆనవాళ్లు గోచరిస్తున్నాయి.1996నుంచి 2003 వరకు పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు చేశారు. ఈ తవ్వకాలలో పైడిపాక వద్ద రెండో శతాబ్దం బౌద్ధ కాలం నాటి కట్టడాలకు ఉపయోగించిన ఇటుకలు, దేవాలయాలు, కొన్ని పురాతన వస్తువులు బయటపడ్డాయి. అనంతరం పోలవరం ప్రాజెక్టు ప్రారంభం కావడం, కొంత నిధులు లేమితో పురాతన తవ్వకాలు ఆగిపోయాయి. ఇంకా ఈ ప్రాంతంలో రాజుల కోటకు సంబంధించి గుర్తులు ఉన్నాయి. ఆనాటి సాంస్కృతిక సంప్రదాయాలు ఈ ఆనవాళ్ళు సాక్షాధారాలుగా కనిపిస్తాయి.

మరల ఇప్పుడు తవ్వకాలలో రెండు రోజుల క్రితం పురాతన శివలింగం బయటకు రావడంతో ఈ అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.ఏమైనా ఘనమైన చరిత్ర ఆనవాళ్లను బయటకు తీయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. శివగిరిలోగల శివలింగం, పట్టిసీమలో గల శివలింగం ఒకే విధంగా ఉంటాయి. అలాగే తూటికుంట్లలో ఒకే ప్రదేశంలో ఉన్న మూడు శివలింగాలు, పైడిపాకలో గల శివలింగం ఒకేలాగా ఉన్నాయి. కచ్చులూరులో భారీ విగ్రహం కలదు. చిడూరు, సింగన్నపల్లి శివలింగాలు ఒకేవిధంగా ఉన్నాయి. ఈ ప్రాంత చారిత్రక సాంప్రదాయం, సంస్కృతి తెలియజేసే ఈ పురాతన ఆనవాళ్లు, గుర్తులను సేకరించి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement