మరిపెడ, (ప్రభ న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్టేజీ తండా జీపీ పరిధిలోని ఆనందనిలయం వెంచర్ నిబంధనలకు విరుద్దంగా లే అవుట్ చేశారని, ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా వెంచర్ చేసి ప్లాట్లు విక్రయిస్తుండటంతో పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం అక్రమ వెంచర్ బోర్డు ఏర్పాటు చేసినట్లు ఎంపీవో పూర్ణచందర్ రెడ్డి, జీపీ కార్యదర్శి సోమేష్వరి గురువారం తెలిపారు. జీపీ కార్యదర్శి సోమేష్వరి తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో కొంత మంది స్టేజీ తండా జీపీ పరిధిలో ఆనేపురం రోడ్‌లో సుమారు 7 ఎకరాల భూమి కొలుగోలు చేశారు.
అనంతరం 2018 నుంచి ఆనందనిలయం పేరుతో లే అవుట్ తయారు చేసి విక్రయించినట్లు తమ దృషికి రాగా అప్పుడే నోటిసులిచ్చామన్నారు. అనుమతి వస్తుందని అనటం, కరోనా రావటంతో సుమారు మూడేళ్లు ప్రశాంతంగా ఉండగా ఏడాదిన్నరగా సుమారు 4సార్లు నోటిసులిచ్చామని తెలిపారు.
ఐదేళ్లలో సుమారు 30శాతం పైన ప్లాట్లు లే అవుట్‌లో విక్రయించినట్టు తెలిపారు. కాగా ప్లాట్లు కొన్న వారు ఒకరు ఇళ్లు కడుతుండగా వెంచర్‌కు ఎలాంటి అనుమతి లేదని ఇంటి నిర్మాణం చేయకుడదని నిలిపివేశామన్నారు. ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోకపోవటంతో పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 113ను అనుసరించి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం డీటీపీసీ, టీయస్ బీ పాస్, జీపీ ఆమోదం లేని ఆనందనిలయం వెంచర్ అక్రమ లేఅవుట్‌గా బోర్డు పెట్టామని స్పష్టం చేశారు.
కాగా బోర్డు పెట్టడంతో స్థానికంగా ఉన్న కొనుగోలు దారులు ప్రవీణ్, దూప్‌సింగ్ వెంచర్ వద్దకు చేరుకుని అక్కడే ఉన్న సూపర్‌వైజర్‌ను నిలదీశారు. దీంతో ఆయన తమకు అనుమతులు ఉన్నాయని, తాము జిల్లా కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటామన్నారు. ఇదే విషయమై సదరు వెంచర్ యజమానిని వివరణ కోరగా తమకు అన్ని ధ్రువ పత్రాలు ఉన్నాయని, ఎల్ఆర్ఎస్ ద్వారా సుమారు 30శాతం విక్రయాలు చేసి రిజిస్టేషన్ చేశామని తెలిపారు.