Friday, November 22, 2024

Analysis – హర్యానాలో హోరాహోరి ! – కూట‌మికే ఓటేసిన‌ సుంద‌ర క‌శ్మీరం

హ‌ర్యానాలో మూడోసారి క‌మ‌లం పాగా
కౌంటింగ్‌లో ప‌లుమార్లు ఎగుడు దిగుడులు
ఒక ద‌శ‌లో ఎక్కువ సీట్ల‌తో ఆధిక్యంలో కాంగ్రెస్‌
మ‌ళ్లీ పుంజుకుని లీడింగ్ క‌న‌బ‌ర్చిన బీజేపీ
కాంగ్రెస్ ఆశ‌ల‌ను దెబ్బ‌తీసిన ఆమ్ ఆద్మీ పార్టీ
చాలా చోట్ల‌ వెయ్యి ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ ఓట‌మి
జ‌మ్ము, క‌శ్మీర్‌లో ఆర్టికల్ 370ర‌ద్దుకు వ్యతిరేకం
ప్ర‌ధాని మోదీ మాట‌ల‌ను న‌మ్మ‌ని లోయ జ‌నం
కాంగ్రెస్ కూట‌మికే ప‌ట్టం క‌ట్టిన జ‌మ్ము, క‌శ్మీర్‌
ఢిల్లీ, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌పై ఎఫెక్ట్‌ ఉండే చాన్స్‌
ఆందోళ‌న చెందుతున్న క‌మ‌ల‌నాథులు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ :

హర్యానా ప్రజలు ఇప్పటి వరకు ఒకేపార్టీకి మూడోసారి పగ్గాలు అప్పగించిన చరిత్ర లేదు. గతంలో 1962, 1972, 2005, 2009ఎన్నికల్లో కాంగ్రెస్‌కు హరియానా ప్రజలు పట్టం కట్టారు. ప్రతి పదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చటం ఇక్క‌డ‌ అలవాటు. 2014, 2019లో కమలనాథులకు అవకాశం ఇచ్చారు. గత చరిత్రతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ తమకు ఓటమి తప్పదని బీజేపీ అగ్రనాయకత్వం అంతర్గతంగా ఆందోళన చెందింది. ఈ పరిస్థితి గమనించిన బీజేపీ హైకమాండ్, ఖట్టర్‌ను తొలగించి బీసీ కార్డు ప్రయోగించింది.

37 సెగ్మెంట్ల‌లో జాట్‌ల ప్రాబ‌ల్యం..

హరియానా పేరు చెప్పగానే జాట్‌లు గుర్తొస్తారు. 37 నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం ఉంది. ఇది హర్యానా అసెంబ్లీలో 40 శాతం అన్నమాట. రెండుసార్లు పార్టీకి చాన్స్ ఇచ్చినా తమ కమ్యూనిటీని దూరంగా పెట్టిందనే ఆక్రోశం నెలకొంది. ఈ కారణంగానే పదేళ్లు సీఎం పీఠానికి దూరంగా పెట్టిందనే భావన వారిలో నెలకొంది. దీనికితోడు సైన్యంలో అగ్నిపథ్ వ్యవస్థను తీసుకురావడాన్ని హరియానా యువత తప్పుపట్టింది. ఇటు రైతుల ఆందోళన, అటు రెజ్లర్ల ఆగ్రహం ఇవన్నీ కలిసి కమలనాథులపై తీవ్ర ప్రభావం చూపాయనే చెప్పవచ్చు.

- Advertisement -

ఆ 26 స్థానాలే కీలకం..

హరియానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా విజయావకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే ముందే తేల్చింది. ముఖ్యంగా 26 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ద్విముఖ పోరు నెలకొని ఉందని, ఆ నియోజకవర్గాల్లో గెలుపోటములు, మొత్తంగా అధికారం చేపట్టే విజేతను తేలుస్తాయని ఆ సర్వే వెల్లడించింది. హరియానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి.. కనీసం 46 సీట్లలో విజయం సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది. సెప్టెంబర్ 20 నాటికి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఈ ఎన్నికల్లో గెలుపోటముల అవకాశాలపై పీపుల్స్ పల్స్ రిపోర్ట్ ఆసక్తికర అంచనాలను వెలువరించింది.

మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో, 35 సీట్లలో కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపిస్తోంది, 23 సీట్లలో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోందని ఈ సర్వే తేల్చింది. స్వతంత్రులు 3 స్థానాల్లో, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి మరో 3 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. మిగతా 26 సీట్లలో హోరాహోరీ పోరు తప్పదని తేల్చింది. ప్రస్తుతం ఫలితాలను పరిశీలిస్తే.. గంట గంటకూ ఆధిక్యంలో మార్పులు కనిపిస్తున్నాయి. 50 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ ప్రస్తుతం 48 స్థానాల్లో లీడ్‌లో ఉంది. అంటే గతం కంటే 8 స్థానాలను పెంచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఏతావాతా ఈ రెండు పార్టీల ఆధిక్యత ఎంత మారినా.. బీజేపీకి అధికారం లభిస్తుందని ఇప్పటికీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

కాశ్మీర్‌లో కూటమి సునామీ

జమ్మూకశ్మీర్ విషయంలో బీజేపీని కశ్మీరీలు తిరస్కరించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్. ఈ రెండు పార్జీలు మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. గడిచిన పదేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో బీజేపీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఇందులో ఎలాంటి సందేహం లేద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. క‌శ్మీర్ లోయలో బీజేపీని ఆద‌రించ‌లేదు. నేషనల్ కాన్ఫరెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి జనం అవకాశం ఇచ్చారు. 40 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ , 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కలిసి 51 స్థానాల్లో విజయం కోసం పరుగులు తీస్తున్నాయి. గతంలో బీజేపీతో జత కలిసి అధికారం చేపట్టిన పీడీపీని కూడా జనం వ్యతిరేకించారు. కేవలం రెండు స్థానాల్లోనే ఆ పార్టీ లీడ్‌లో ఉంది. 9 మంది స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు. వీరి గెలిచినా బీజేపీకి అధికారం కష్టం. ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దు బీజేపీని దెబ్బ‌తీసింద‌ని చెప్పుకోవ‌చ్చు. దేశభక్తి, ఉగ్రవాదంపై యుద్ధం.. ఈ నినాదాలేవీ పని చేసిన‌ట్టు లేవ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

కాషాయ కోటలో డేంజర్ బెల్స్ ..

హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలతో.. ఢిల్లీలోని కాషాయ కోటలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఒకప్పుడు మహారాష్ట్రలో బీజేపీ బలంగా ఉండేది. కాకపోతే శివసేన, ఎన్సీపీని విభజించి పాలించడాన్ని మెజార్టీ మరాఠాలు జీర్ణించు కోలేకపోయారు. దాని కారణంగా గత లోక్‌సభ ఎన్నికల్లో కమలనాథులకు షాకిచ్చారు. ఇవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ కావచ్చనే సంకేతాలు బలంగా ఉన్నాయి.

హ‌స్తిన‌పై ఆశ‌లు..

ఢిల్లీ విషయానికొస్తే బీజేపీ వ్యూహాలను ఆఫ్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పసిగట్టారు. లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీపై మహిళను కూర్చొబెట్టారు. దీంతో ఢిల్లీ ఓటర్లలో ఆ పార్టీ మరింత ఇమేజ్ పెరిగింది. బలమైన పోటీ ఇవ్వాలని కమలనాథులు భావించారు. కేజ్రీవాల్ ఎత్తులకు బీజేపీ చిత్తయ్యిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్‌తో కలిసి ఆప్ పోటీ చేస్తే హస్తిన పీఠం బీజేపీ అందుకోవడం కష్టమేనని అంటున్నారు. ఉత్తరాదిలో ప్రజలు రిజక్ట్ చేస్తే కష్టమనే అభిప్రాయం అప్పుడే కమలనాథుల్లో మొదలైంది. గడిచిన పదేళ్లు మోదీ హవా మీద గెలిచామని చెప్పుకుంటూ కీలక నాయకులు కాలం గడిపేశారు . కశ్మీర్, హరియాణ ఫలితాలతో కమలనాథులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక బీజేపీలో మోదీ శకం ముగిసినట్టేనన్న వాదన ఓ వర్గంలో మొదలైంది. పరిస్థితి జఠిలం కాకముందే మేల్కొంటే మంచిందని, లేకుంటే కష్టమని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement