ప్రజల గొంతు తడిపే అద్బుతమైన పథకం అమృత్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అమృత్ 1 కింద దేశవ్యాప్తంగా రూ.50వేల కోట్లను ఖర్చు చేసి నూతనంగా 1 కోటి 34 లక్షల నీటి కనెక్షన్‌లు అందించడంతో పాటు 1 కోటి 2 లక్షల మురుగు నీటి కనెక్షన్‌లు ఇచ్చామని వెల్లడించారు. అమృత్ 2లో భాగంగా రూ.2.99లక్షల కోట్ల వ్యయంతో దేశంలోని మున్సిపాలిటీలు, నగరాల్లో నీటి కోసం అల్లాడుతున్న ప్రజల దాహార్తిని తీర్చబోతున్నామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి అమృత్ 1, 2 కింద రూ.6876 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి ఒక్కరికీ 24గంటల పాటు తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, ఈ విషయంలో కేంద్రం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.
‘‘రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యం. ఎన్నికల వరకే రాజకీయాలు. పగలు, పంతాలకు పోతే అభివృద్ధి చేయలేం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేం. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. అభివృద్ధిలో కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదాం’’అని పిలుపునిచ్చారు. అతి త్వరలో కొండగట్టు, వేములవాడ, ఇల్లంద కుంట ఆలయాలను టెంపుల్ సర్క్యూట్ పరిధిలోకి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ లోని టీటీడీ దేవస్థానానికి నిధుల మంజూరు అంశంపైనా టీటీడీ ఛైర్మన్ తో మాట్లాడినట్లు తెలిపిన కేంద్ర మంత్రి ఈ విషయంలో సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈరోజు కరీంనగర్ సిరిసిల్ల బైపాస్ రోడ్డు సమీపంలోని ప్రజారోగ్య శాఖ కార్యాలయం వద్ద విలీన గ్రామాల కోసం అమృత్ 2 స్కీం కింద ఫిల్టర్ బెడ్ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు స్థానిక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే…
మన దేశంలో 36శాతం జనాభా నగరాల్లోనే నివసిస్తోంది. 2047 నాటికి పట్టణాల్లో నివశించే జనాభా 50శాతం కంటే ఎక్కువ కాబోతోందన్నారు. ప్రస్తుతం పట్టణాల్లో నివశిస్తున్న ప్రతి వ్యక్తికి రోజుకు సగటున 136లీటర్లు అవసరం. కానీ 69లీటర్ల నీరు మాత్రమే అందుతోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో దూరదృష్టితో నగరాలు, పట్టణాల్లో నివశించే ప్రతి ఇంటికీ సరిపడా నీటిని అందించంతో పాటు, డ్రైనేజీ సౌకర్యం కల్పించి నీటి భద్రతా నగరాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అమృత్ 1(అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పథకాన్ని ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చే గొప్ప పథకం అమృత్ అన్నారు.
2015 జూన్ 25న ప్రారంభమైన అమృత్ 1 పథకం కింద (2015-16 నుండి 2019-20 వరకు) కేంద్ర ప్రభుత్వం తన వాటాకింద ఖర్చు 50వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. అమృత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1కోటి 34లక్షల నీటి కనెక్షన్‌లు అందించగలిగామన్నారు. 1 కోటి 2 లక్షల మురుగునీటి కనెక్షన్‌లు అందించామని, వీటితో పాటు 2వేల 411 పార్కులను అభివృద్ధి చేసుకోగలిగామన్నారు. 62 లక్షల 78వేల ఎల్ఈడీ లైట్లను మార్చుకోగలిగామన్నారు. అమృత్ 2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్రాలు, మున్సిపాలిటీల భాగస్వామ్యంతో ఈసారి 2లక్షల 99వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాలని నరేంద్రమోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
మన రాష్ట్రం విషయానికొస్తే… అమృత్ 1, అమృత్ 2.0 కింద మొత్తం 6వేల 876కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. ఇందులో కేంద్రం వాటా 3వేల 591కోట్ల 72లక్షల అని, రాష్ట్ర వాటా కింద 2వేల 614 కోట్ల 82లక్షలని, ఎంపిక చేయబడిన మున్సిపాలిటీల వాటా 669 కోట్ల 85 లక్షలన్నారు. అమృత్ 1 కింద 11 వందల 53 కోట్లు, అమృత్ 2కింద 2వేల 438 కోట్ల రూపాయలను నరేంద్రమోదీ ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికొస్తే… అమృత్ 1, అమృత్ 2 కింద మొత్తం 852 కోట్ల 11 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. అందులో కేంద్ర వాటా 481కోట్ల 19 లక్షలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 297 కోట్ల 55 లక్షలు, మున్సిపాలిటీల వాటా 73 కోట్ల 37 లక్షలన్నారు.
ఇక మన కరీంనగర్ మునిసిపల్ కార్పోరేషన్ విషయానికొస్తే… తాను మొదటిసారి ఎంపీగా గెలిచిన తరువాత అమృత్ 1 కింద 136 కోట్ల 56 లక్షల రూపాయలు ఖర్చు చేసినమన్నారు. ఇందులో కేంద్రం 80కోట్ల 10 లక్షల రూపాయలను ఖర్చు చేసిందన్నారు. గతంలో కరీంనగర్ కు 2,3 రోజులకోసారి నీళ్లు వచ్చేవని, ఈ పథకం వల్ల ప్రతిరోజూ కరీంనగర్ వాసులకు మంచి నీళ్లను అందించగలుగుతున్నామన్నారు. ఈరోజు అమృత్ 2 పథకాన్ని ప్రారంభించుకోబోతుండటం ఆనందంగా ఉందన్నారు. ఈ అమృత్ 2 కింద 145 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా కింద 56కోట్ల 46లక్షలను కేటాయిస్తున్నామన్నారు. రాష్ట్ర వాటా కింద 75 కోట్ల 74 లక్షల రూపాయలు, నగర పాలక సంస్థ వాటా కింద 13 కోట్ల 30 లక్షలు సమకూర్చుకోవాల్సి ఉందన్నారు.
ఈ నిధులతో 10 ఎంఎల్ డీ ఫిల్టర్ ప్లాంట్, మెయిన్ లైన్, డిస్ట్రిబ్యూషస్ లైన్, విలీన గ్రామాల్లో నీటి ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామన్నారు. 1) రేకుర్తి గుట్ట పైన, 2.మునిసిపల్ మార్కెట్ వాటర్ ట్యాంక్ దగ్గర, 3) ఎల్.ఎం.డి. కాలనీలో, 4) సీతరాంపూర్ లో, 5) తీగలగుట్టపల్లిలో, 6) అల్గునూర్ లో, 7) ఆరేపల్లిలో ఆయా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామన్నారు. మొత్తం 159.55 కిలోమీటర్ల మేరకు పనులు చేయబోతున్నామన్నారు. రాబోయే రెండేళ్లలో ఈ పనులను పూర్తి చేసి మరో 10వేల 500 కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు అందించబోతున్నామన్నారు.
కరీంనగర్ లో రాబోయే 30ఏళ్లకు తగినట్లుగా అభివృద్ది ప్రణాళికలను రూపొందించి అమృత్ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరాన్ని చాలా వరకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్న సంగతి మీకు తెలిసిందే. స్మార్ట్ సిటీలో వచ్చిన నిధుల్లో 18 కోట్ల రూపాయలను వెచ్చించి హౌజింగ్ బోర్డు కాలనీ రిజర్వాయర్ పరిధిలోని 5 డివిజన్లకు త్వరలోనే 24 గంటల పాటు మంచినీళ్ల సరఫరా చేయబోతున్నామన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో స్మార్ట్ సిటీ, అమృత్ నిధులు రావడం కరీంనగర్ ప్రజలకు మంచినీళ్లు అందిస్తూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, పగలు, పంతాలకు పోతే అభివృద్ధి చేయలేమన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేమన్నారు. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం, అభివృద్ధిలో కరీంనగర్ ను ఆదర్శంగా నిలుపుదామన్నారు.
మోడీపై యుద్దం మాని… వడ్లు కొనండి
కరీంనగర్ : ‘‘నరేంద్రమోదీ ప్రభుత్వంపై యుద్దం చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదు… యుద్ద ప్రాతిపదికన వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లను కొనుగోలు చేయండి. ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించండి. రైతులు పడుతున్న అరిగోసను తీర్చండి’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈరోజు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని సంజయ్ తప్పు పట్టారు. పెండింగ్ బిల్లులతో ఈరోజు మాజీ సర్పంచులు రోడ్డెక్కి బిచ్చగాళ్లుగా అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే… అందుకు కారకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులేనన్నారు. కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అదే సమయంలో రాజకీయ లబ్ది కోసం ఆదరబాదరాగా కులగణన చేసి అభాసుపాలు కావొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
మాజీ సర్పంచుల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ సర్పంచులు బిచ్చగాళ్లుగా మారడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని రెండు పార్టీలు హామీలిచ్చి గాలికొదిలేయడంవల్లే ఈ దుస్థితి. మూసీ పునరుజ్జీవం కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ సర్పంచులకు నిధులివ్వడానికి మనసు రావడం లేదా ? వాళ్లకు తిండి తినే పరిస్థితి లేదు. కచ్చితంగా ఆదుకోవాలి. లేకుండా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. ఆదరబాదరాగా చేయొద్దు. అందరికీ న్యాయం చేయాలన్నదే బీజేపీ డిమాండ్ అన్నారు. వరంగల్ నుండి కరీంనగర్ జాతీయ రహదారి పనుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం మళ్లీ వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. వడ్ల కొనుగోళ్లు లేక రైతులు అల్లాడుతున్నారు. రోడ్లపై వడ్లు పోసి ఎదురు చూస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ? లేదా ? అనే అనుమానం కలుగుతోందన్నారు. రైతులు అనేక సమస్యలతో అల్లాడుతున్నారన్నారు. 20లక్షల మందికి ఇంకా రుణమాఫీ రాలే. రైతు భరోసా ఇయ్యలే అని, అన్నిరకాల వడ్లకు బోనస్ ఇస్తామని మోసం చేసిందన్నారు. మోడీపై యుద్దం చేస్తానని ప్రగల్భాలు పలకడం కాదు… దమ్ముంటే యుద్ద ప్రాతిపదికన వడ్ల కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులు తెచ్చిన వడ్లన్నీ కొనుగోలు చేసి బోనస్ తో సహా డబ్బులు చెల్లించాలన్నారు.