Monday, November 25, 2024

మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ

తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విమోచన శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పరాక్రమం వల్లే హైదరాబాద్ సంస్థానం విమోచనం సాధ్యమైందని చెప్పారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని తెలిపారు. మజ్లిస్‌కు బీజేపీ భయపడదని అమిత్ షా స్పష్టం చేశారు.  కర్ణాటకలో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పడితే.. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్‌ హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. విమోచన దినోత్సవం జరిపేందుకు కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్‌కు పట్టవా? అని అడిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని అమిత్​ షా హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ అంతిమదశకు చేరిందన్న అమిత్ షా… మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ అని వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రమే మజ్లిస్ తో పోరాడుతుందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ తో దోస్తీ చేస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు.

ఇది కూడా చదవండి: రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement