Monday, December 23, 2024

TG | అమిత్ షాను మంత్రి వర్గం నుండి బర్తరప్ చేయాలి : ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఎన్నికలకు ముందు లబ్ధి పొందడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను కీర్తించిన బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అహంకారపూరితంగా దైవంగా పూజింపబడే అంబేద్కర్ను విమర్శించడాన్ని భారతదేశంలోని యావత్ ప్రజానీకం అసహ్యించుకుంటున్నారని అన్నారు.

బిజెపి పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు రక్షణ కరువైందని, సెక్యులర్ దేశమైన భారతదేశంలో మత ప్రాతిపదికన చిచ్చులు పెడుతుందని, ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా మణిపూర్లో మైనార్టీ, క్రిస్టియన్ ల పై ఆటవికంగా నట్ట నడిరోడ్డుపై వారి హక్కులను కాలరాస్తూ వారిపై జరుగుతున్న పైశాచిక దాడులే సాక్ష్యమని వివరించారు.

నాటి ఇందిరా గాంధీ నుండి నేటి సోనియా గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని పాటిస్తూ అందరి పక్షాన నిలుస్తూ గౌరవిస్తుందని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ పై బిజెపి మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పిసిసి ఆదేశాల మేరకు సోమవారం అచ్చంపేట పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇట్టి ర్యాలీకి నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి, తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి, మెగా రెడ్డి తదితరులు హాజరవుతున్నందున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement