హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణకు పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కంపెనీలను నెలకొల్పేందుకు ఆసక్తిని చూపిస్తు న్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో పలు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చు కుంటున్నాయి. వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్ కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ”మెడ్‌ట్రానిక్స్” సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.3,000 కోట్లతో హైదరాబాద్ నగరంలో మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ నున్నట్లుగా ప్రకటించింది. అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చే ప్రయత్నంలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో మెడ్ ట్రానిక్ ప్రధాన కార్యాలయం ఉంది. 150 కంటే ఎక్కువ దేశాల్లో 90 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. కార్డియాక్ పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఇన్సూలిన్, సర్జికల్ టూల్స్, పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ వంటి 70 రకాల ఆరోగ్య సమస్య ల చికిత్సలో ఉపయోగించే పరికరాల ఆవిష్కరణలు ఈ సంస్థ చేస్తుంటుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకుంటున్న చర్యలే పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణంగా ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశంలో స్పష్టం చేశారు. ఐదేళ్లల్లో 1500కు పైగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ సీఈవో ఎం నాగప్పన్ పాల్గొన్నారు.
‘ఆక్యూజెన్’ కూడా…
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ రాబోతుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా కేంద్రంగా పని చేస్తున్న బయోటెక్నాలజీ కంపెనీ ”ఆక్యూజెన్” హైదరాబాద్ నగరంలో తన సంస్థను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జీన్ థెరపీ, రీజనరేటివ్ సెల్ థెరపీ వ్యాక్సిన్ల తయారీకి సహకారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే సెంటర్ నుంచే అందించనుంది. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే కేంద్రం నుంచే ప్రధాన కార్యకలాపాలను నిర్వహించనున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఒక గ్లోబల్ సంస్థగా ఆవిర్భవిస్తుందని ఆశాభావాన్ని తెలిపారు. భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఇదో గొప్ప అవకాశంగా అభివర్ణించారు.
2030నాటికి 250 బిలియన్ డాలర్ల మార్కెట్
హైదరాబాద్‌లో అద్భుతమైన బయోటిక్ పరిశ్రమలు, ఆ రంగానికి అవసరమైన నైపుణ్యాలు రాష్ట్రంలో ఉన్నందున దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు నగరంలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. 2030నాటికి తెలంగాణ బయోటెక్ ఈకో సిస్టం 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆక్యూజెన్ కంపెనీని హైదరాబాద్ నగరానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ పరిశోధన కేంద్రానికి సంపూర్ణ సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కంపెనీ సీఈవో అరుణ్ ఉపాధ్యాయ, ఛైర్మన్ శంకర్ ముసునూరితో పాటు పలువురు పాల్గొన్నారు.