Tuesday, November 26, 2024

America Tour – గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలిరండి – ఉప ముఖ్యమంత్రి భట్టి పిలుపు

పరస్పర అభివృద్ధిలో పలుపంచుకుందాం
అమెరికన్ కంపెనీలతో కలిసి
తెలంగాణ వ్యాపార బంధాలు మరింత బలోపేతం
వినూత్న ఆవిష్కరణలు, నిలకడతో కూడిన అభివృద్ధి కి బాటలు వేద్దాం
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో మరిన్ని అవకాశాలు
మైన్ ఎక్స్ పో ఇంటర్నేషనల్ సదస్సులో భట్టి పిలుపు

హైదరాబాద్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ఎంతో ముందు చూపుతో పురోగమిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని, గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలిరావాలని తెలంగాణ అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు.
అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న మైన్ ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రపంచ వ్యాప్త వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిథులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిథుల సమావేశాలలో ఆయన మాట్లాడారు. భారతదేశ ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, ముఖ్యంగా తెలంగాణలో దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్ ను తమ స్వస్థలంగా భావిస్తూ.. వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకున్నదని తెలిపారు.


రాష్ట్రప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపాయాలు గల హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం కానున్నదని కనుక అమెరికన్ కంపెనీల వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -


ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రత్యేకతను వివరిస్తూ ఈ మహానగరం టెక్నాలజీ హబ్ గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉంటుందన్నారు. కరోనా విపత్కర సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, బైలాజికల్-ఇ, భారత్ బయోటెక్ వంటి కంపెనీల ఆవిష్కరణలతో “వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్” గా, ఈ నగరం ప్రపంచ ఖ్యాతి గడిచిందన్నారు.


ఐటీ అభివృద్ధిలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ జరుగుతోందని, ఇక్కడ ఏ.ఐ. తో నిర్వహించే పరిశ్రమలు, ఏ.ఐ. అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని, ఈ విభాగాల్లో ఆసక్తిగల, అనుభవం ఉన్న ప్రపంచవ్యాప్త కంపెనీలకు తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను కూడా వివరించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఇంధన మరియు పారిశ్రామిక విధానాలు రూపొందించడం జరిగిందని, కొత్త ఆవిష్కరణలకు, ఆర్థికాభివృద్ధికి ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలుంటాయన్నారు.


హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న అమెరికన్ కంపెనీలకు ఇక్కడ సానుకూల వాతావరణం, నైపుణ్యం గల మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని వృద్ధి చేయడానికి, నిలకడగల అభివృద్ధికి దోహదం చేసే సొల్యూషన్స్ కు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ లో నైపుణ్యత గల మానవ వనరులకు కొదవలేదని, పర్యావరణహిత పునరుత్పాదక ఎనర్జీ మరియు గ్రీన్ టెక్నాలజీలకు, సంబంధిత పరిశ్రమలకు అవకాశం మెండుగా ఉంటుందన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తో పాటు ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్, స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు.
మైనెక్స్ 2024 లో గురువారం నాడు (సెప్టెంబర్ 26) ఆయన ఆస్ట్రేలియాకు చెందిన డోపల్ మేర్ కంపెనీ స్టాల్ ను సందర్శించారు. ఈ కంపెనీ రూపొందించిన అత్యాధునిక బొగ్గు మరియు ఓవర్ బర్డెన్ రవాణా బెల్టులను, వాటి పనితీరును పరిశీలించారు. సౌత్ ఆఫ్రికా, స్విజర్లాండ్, గ్యాటిమల వంటి దేశాలలో తమ కంపెనీ బెల్టులతో జరుగుతున్న రవాణా ప్రక్రియను స్టాల్ నిర్వాహకులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement