హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. పాలిటెక్నిక్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని 118 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 28,083 సీట్లకుగానూ 20,695 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా 73.69 శాతం సీట్లు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే పూర్తయ్యాయి. మరో 7388 సీట్లు మాత్రం మిగిలిపోయాయి. కేటాయించిన సీట్లల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 393 సీట్లను భర్తీ చేశారు. 118 కాలేజీల్లో 26 ప్రభుత్వ కళాశాలలు, 5 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 31 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు.
కంప్యూటర్ సైన్స్ కోర్సులో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్, ఇతర కోర్సులకు డిమాండ్ తగ్గింది. డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సుల్లో పూర్తి సీట్లు భర్తీ అయ్యాయి. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, కంప్యూటర్ ఇంజనీరింగ్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ కోర్సులు సైతం వంద శాతం సీట్లు నిండాయి. అయితే సివిల్ కోర్సు, మెకానికల్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, మెటలార్జికల్ ఇంజనీరింగ్, 3డి యానిమేషన్ గ్రాఫిక్స్ తదితర డిప్లొమా కోర్సుల్లో సీట్లు పూర్తి స్థాయిలో నిండలేదు. దీంతో మరో 7388 సీట్లు మిగిలిపోయాయి. ప్రస్తుతానికి మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవడంతో మిగిలిన సీట్లను రెండో విడతలో పూర్తి చేయనున్నారు. ఐతే రెండో విడత సీట్ల ప్రక్రియకు సంబంధించిన తేదీలను అధికారులు ప్రకటించలేదు. వచ్చే నెల 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.