Tuesday, November 26, 2024

Order Order | కోకాపేటలో భూముల కేటాయింపు.. ప్రభుత్వానికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట వద్ద విలువైన 11 ఎకరాల భూములను బీఆర్‌ఎస్‌ పార్టీకి కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్‌ఎస్‌ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 16 కి వాయిదా వేసింది. కోకాపేట వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.500 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) చైర్మన్‌ పద్మనాభ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌ )ను మంగళవారం తాత్కాలిక ప్ర ధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ , జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారించింది.

కోకాపేటలో సర్వే నంబర్‌ 239,240 లలో ఎకరాభూమి ధర రూ. 50 కోట్లు ఉందని, 11 ఎకరాల విలువ రూ.500 కోట్లు పైబడే ఉంటుందని, కానీ, ప్రభుత్వం ఎకరా భూమిని కేవలం రూ. 3.41 కోట్లకే కేటాయించిందని పద్మనాభరెడ్డి కోర్టుకు నివేదించారు. భూ కేటాయింపులకు సంబంధించిన పత్రాలన్నీ రహస్యంగా ఉంచారని విన్నవించారు. అంతేగాక ఇంతకు మునుపు బంజారాహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీకి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం భూమి కేటాయించిందని విన్నవించారు. భూకేటాయింపులను రద్దుచేయాలని కోర్టును అభ్యర్థించారు.

వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, బీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌కు నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా, కోకాపేట వద్ద ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ పేరుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ కార్యాలయానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు భూకేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలకు ఈ కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement