హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ రోజు (ఆదివారం) నుంచి ప్రారంభమైంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులకు సోమవారం వరకు అవకాశం కల్పించారు. అప్షన్లు ఇచ్చుకునేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువిచ్చారు. తుది విడత సీట్లను ఈనెల 29న కేటాయించనున్నారు. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు పొందుతారు. రాష్ట్రంలో మొత్తం సీట్లు 11,260 ఉండగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో 9968 సీట్లు కేటాయించారు.
అయితేసీటు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసింది మాత్రం 8383 మంది. దీంతో మిగిలిన 2877 సీట్లకు తుది విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. బీఫార్మసీ (ఎంపీసీ స్ట్రీమ్) సీట్లు 1174లో మొదటి విడత కౌన్సెలింగ్‌లో కేటాయించింది 50 కాగా అందులో రిపోర్టింగ్ చేసింది 39 మంది ఉన్నారు. మిగిలిన 1135 సీట్లకు తుది విడతలో కేటాయించనున్నారు.