Sunday, November 24, 2024

రైల్వే ప్రాజెక్టులకు స్థలాలు కేటాయించండి.. సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులకు స్థలాలు కేటాయించి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖను బహిర్గతం చేశారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే రద్దీ స్టేషన్లుగా మారిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లకు అదనంగా చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేసి మార్చి 2023 నాటికి కొత్త టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.

వివిధ సమావేశాల అనంతరం ఇటీవలే రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి స్థలాన్ని పరిశీలించి కొన్ని ప్రతిపాదనలు చేశారని తెలిపారు. ఆ ప్రకారం చర్లపల్లి-ఎఫ్సిఐ గోడౌన్ వైపు నుండి రైల్వే స్టేషన్ నూతన భవనానికి దారితీసే 100 అడుగుల వెడల్పు రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని రైల్వే శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఈ రోడ్డు కోసం 4.61 ఎకరాల స్థలాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉందని తెలిపారు. గత రెండు సంవత్సరాల క్రితమే రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

అలాగే భరత్ నగర్ వైపు గల అప్రోచ్ రోడ్డు 28 అడుగుల వెడల్పు మాత్రమే ఉందని, దీన్ని కనీసం 60 అడగుల వెడల్పునకు విస్తరించాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వమే భూసేకరణ జరిపి రోడ్డును విస్తరించాలని కోరారు. చర్లపల్లి-ఈసీనగర్ వైపు అప్రోచ్ రోడ్డు సైతం 30 అడుగుల వెడల్పు మాత్రమే ఉందని, ఈ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా చేయడానికి తగిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని కోరారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న రైల్వేస్టేషన్ టెర్మినల్ భవనానికి చేరుకునే ప్రయాణికుల వాహనాలను నిలిపేందుకు తగిన పార్కింగ్ స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ నగరానికి పశ్చిమ దిక్కున నాగులపల్లి రైల్వేస్టేషన్ వద్ద కూడా టెర్మినల్ నిర్మాణం, పార్కింగ్ స్థలం కోసం దాదాపు 300 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖకు కేటాయించాలని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అలాగే ఈ రైల్వేస్టేషన్ అప్రోచ్ రోడ్డు అభివృద్ధి కోసం కూడా అవసరమైన సహాయం చేయాలని కోరారు. ఈ రెండు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు అందజేస్తే రైల్వే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించటంతో పాటుగా ఆయా ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement