ఖమ్మం : వ్యవసాయ మార్కెట్లో బుధవారం తేజ రకం ఎండు మిర్చి కొనుగోళ్ల రేటు ఆల్ టైం రికార్డ్ గా చరిత్రకెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి రేటు కింటాకు రూ . 22,500 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎండుమిర్చికి జాతీయంగా.. అంతర్జాతీయంగా మంచి రేటు ఉండడం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నాణ్యమైన ఎండుమిర్చి రావడం, మార్కెట్ అధికారులు, పాలకవర్గం పకడ్బందీ చర్యలు చేపట్టడంతో మిర్చి రేట్లు ఆల్ టైం రికార్డు గా మారాయి.
జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రాక్ష మల్లేశం మార్కెట్లో జెండా పాటలను నిరంతరం పర్యవేక్షిస్తుండడంతో రైతులకు ప్రయోజనం కలుగుతుంది. మంగళవారం రూ . 21, 800 పలికిన ఎండుమిర్చి రేటు ఒక్కసారిగా బుధవారం మరింత పెరిగి 22,500 కు చేరడంతో నాణ్యమైన మిర్చీని పండించిన రైతులను, కొనుగోలు చేసిన ఖరీదు కమిషన్ వ్యాపారులను మార్కెట్ కమిటీ పాలకవర్గం ఘనంగా శాలువాలతో సన్మానించి అభినందించారు.