హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లిహిల్స్‌లో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డ వారు మైనర్లు కాదని, వారంతా మేజర్‌లేనని బీజేపీ ఎమ్మెల్యే మరో సంచలన ప్రకటన చేశారు. ఘాతుకానికి పాల్పడ్డ వారంతా ఎంఐఎం నేతల కుమారులు, బంధువులు, సన్నిహితులు అయినందున కేసును నీరు గార్చేందుకు పోలీసులు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని ఒక 10 టీవీలో ప్రసారమైన క్వశ్చన్ అవర్‌లో పేర్కొన్నారు.
కేసు రుజువైనా మైనర్లంటే శిక్ష తగ్గుతుంది కాబట్టి మేజర్లు అయిన నిందితులను మైనర్లని చూపిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని, వారి దర్యాప్తు పూర్తయిన అనంతరం అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. పోలీసులు మైనర్లుగా పేర్కొంటున్న వారందరూ మేజర్లేనని తన వద్ద పూర్తి ఆధారాలున్నాయన్నారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, కేసు దర్యాప్తులో ఉందన్నారని, ఇప్పటికైనా మైనర్లన్న వారికి సంబంధించిన మరిన్ని వివరాలను తెప్పించుకుని పరిశీలిస్తే మేజర్లని తేలుతుందని సూచించారు. ఎంఐఎం నేతలకు భయపడుతున్న పోలీసులు సరైన విధంగా కేసు దర్యాప్తు చేయడం లేదని, ఆధార్‌కార్డులలో పుట్టిన తేదీలను మార్పించారన్న అనుమానం తనకుందన్నారు. నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే మైనర్లంటున్న వారికి సంబంధించిన పుట్టిన సర్టిఫికెట్లను పరిశీలించాలని, 10 తరగతి మార్కుల జాబితాను, స్కూళ్ళలో నమోదైన పుట్టిన తేదీలను పరిశీలిస్తే వాస్తవం ఏమిటన్నది తెలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధితులు ఎవరైనా చట్టం ప్రకారం కేసు దర్యాప్తు చేయాలన్న విషయాన్ని విస్మరించడం బాధాకరమన్నారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడేంత వరకు వదిలేది లేదని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని తేల్చి చెప్పారు. తనపై ఇప్పటికే పోలీసులు ఎఫ్‌ఐఆర్ జారీ చేశారని, నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మంటే వెళ్తానని, కోరితే తన వద్ద ఉన్న వివరాలను కూడా ఇస్తానని చెప్పారు. మైనర్ బాలికకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం చట్ట విరుద్ధమన్న ప్రశ్నకు స్పందిస్తూ బాలికకు సంబంధించిన వివరాలేవీ బహిర్గతం చేయలేదని, విడుదల చేసిన వీడియోలో అమ్మాయి అని గుర్తు పట్టేందుకు కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు.
ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయం లేదంటూ కేసు దర్యాప్తు మొదలు పెట్టక ముందే పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడం వల్ల తాను వీడియోలను విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఏది ఏమైనా పోలీసులు నమోదు చేసిన కేసును ఎదుర్కుంటానని ధీమా వ్యక్తం చేశారు.
నిందితులకు స్టార్ హోటల్ బిర్యానీ, పోలీసుల తీరుపై సర్వత్రావిమర్శలు
కేసు దర్యాప్తులో మొదటి నుంచీ వివాదాలకు కేంద్రంగా మారుతున్న పోలీసులు మరో వివాదానికి కారకులయ్యారు. కస్టడీలోని నిందితులను పోలీసులు ఆదివారం సీన్‌రికన్‌స్ట్రక్షన్ చేసేందుకు తీసుకు వెెళ్ళారు. తిరిగి రాగానే వారి బంధువుల తెచ్చిన స్టార్ హోటల్ బిర్యానీని అందించారు. సాధారణంగా పోలీసు కస్టడీలో ఉన్న వారికి పోలీసులే భోజనం తెప్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వీఐపీల పిల్లలన్న ఉద్దేశ్యంతోనా, ణరే కారణంతోనో తెలియదు కానీ పోలీసులు నిందితుల స్నేహితులు తెచ్చిన స్టార్ హోటల్ బిర్యానీని ఇవ్వడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
పోలీసులు ఉన్న వారి పట్ల ఒక రకంగా, లేని వారి పట్ల మరో రకంగా వ్యవహరించడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు. తప్పు చేశామన్న పశ్చాత్తాపం వారిలో కలగాలంటే పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించాలి కానీ, జల్సాగా ఉంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.