Saturday, November 23, 2024

అన్నీ ప్రతికూలతలే.. 3 నెలల పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలన్న ‘క్రెడాయ్‌’..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ సంక్షోభం అనంతరం తలెత్తిన పరిణామాలు, ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం కారణంగా ఒక్కసారిగా మారిపోయిన అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలతో క్రమేపి పెరుగుతూ వస్తున్న కీలక ముడి సామాగ్రి ధరలతో హైదరాబాద్‌లో నిర్మాణ రంగం కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో బిల్డర్లకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. పెరిగిపోయిన స్టీల్‌, సిమెంట్‌, ఇసుక ధరలకు తగ్గట్లు ఇళ్లు, ఫ్లాట్లు ధరలు పెంచితే డిమాండ్‌ ఒక్కసారిగా పడిపోతుందనే వాదనల నేపథ్యంలో పలునిర్మాణ రంగ అసోసియేషన్లు క్రెడాయ్‌ తెలంగాణ, క్రెడాయ్‌ హైదరాబాద్‌, ట్రెడాలు ఈ ప్రతికూలతల ప్రభావం నుంచి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుని లక్షలాది మంది ఉపాధి అవకాశాలు దెబ్బతినకూడదంటే బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే విధంగా స్టాంపు డ్యూటి, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలపై 3 నెలల పాటు తగ్గించాలని హైదరాబాద్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ ఎక్స్‌పోలో అసోసియేషన్‌కు చెందిన పలువురు ప్రతినిధులు రాష్ట్ర మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ను కోరారు.

అవసరమైతే మహిళల పేరిట జరిగే రిజిస్ట్రేషన్‌లపై స్టాంపు డ్యూటీ మరింత తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తగ్గింపు కారణంగా ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరిగి విక్రయాలు ఊపందుకుంటాయని, దీంతో ప్రస్తుత పెరిగిన ధరల సంక్షోభం నుంచి ఇటు బిల్డర్లకు, అటు కొనుగోలుదారులకు ఊరట కలుగుతుందని క్రెడాయ్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరోపక్క పెండింగ్‌లో ఉన్న లే అవుట్‌ల క్రమబద్ధీకరణను త్వరాగా పూర్తి చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement