హుస్సేన్‌సాగర్ వేదికగా చివరి అంకం..
ఆదివారం నుంచే ప్రారంభమైన శోభాయాత్రలు
క్యూ కట్టి తరలివస్తున్న గణనాథుల వాహనాలు
హుస్సేన్ చుట్ట పక్కల పెరిగిన రద్దీ
జంటనగరాల్లో 18వ తేదీదాకా ట్రాఫిక్ ఆంక్షలు
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : మహా గణేష్ నిమజ్జనోత్సవానికి భాగ్యనగరం రెడీ అయ్యింది. వినాయక మండపం ఏర్పాటు చేసిన ఏడు రోజులు కావడంతో కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు భారీ ఎత్తున నిమజ్జనోత్సవం నిర్వహణకు కమిటీలు సన్నాహాలు చేస్తోంది. అదే విధంగా అందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఖైరతాబాద్, బాలపూర్ వినాయక విగ్రహాలతోపాటు నగరంలో పలు మండపాల నుంచి మంగళవారం శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
క్యూకట్టిన గణనాథుల శోభాయాత్ర వాహనాలు
నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్‌కు గణనాథులు శోభాయాత్రలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. దీంతో హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నిమజ్జనానికి వచ్చే వినాయకులతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గణనాథుల వాహనాలు క్యూ కట్టాయి. ఖైరతాబాద్ నుంచి ఎంజే మార్కెట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నియంత్రించేందుకు ఎవరూ లేకపోవడం, వాటిల్లో చాలావరకు భారీ వాహనాలు ఉండడంతో దారిపొడవునా గంటల తరబడి సమయం పడుతున్నది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 20 నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతున్నది.
మహా గణేష్ నిమజ్జనం దృష్ట్యా…
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంగళ, బుధవారాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయబోతున్నారు. సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధాన మార్గాల్లో విగ్రహాల ఊరేగింపులు వెళ్లేందుకు వీలుగా సాధారణ ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 17, 18తేదీల్లో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.
శోభాయాత్రలు కొనసాగే ప్రాంతాలు
- బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం దగ్గర గణేష్ విగ్రహ ఊరేగింపు కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ (లెఫ్ట్ టర్నింగ్), ఎంబీఎన్‌ఆర్ ఎక్స్ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొహంజాయి మార్కెట్, అబిడ్స్ ఎక్స్ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్‌లో అంబేడ్కర్ విగ్రహం వైపు….
- సికింద్రాబాద్ నుంచి వచ్చే వినాయక విగ్రహ ఊరేగింపులు సంగీత్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు వైపు…
- చిలకలగూడ కూడలి నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్ రోడ్, నారాయణగూడ ఫ్లైఓవర్, వై.జంక్షన్, హిమాయత్‌నగర్ నుంచి లిబర్టీ వైపు…
- ఉప్పల్ నుంచి వచ్చే గణేష్ ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్ జంక్షన్, ఫీవర్ ఆస్పత్రి, బర్కత్‌పుర జంక్షన్ మీదుగా వెళ్లాలి.. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకొని, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలవనుంది….
- దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ఉంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్ రోడ్డులో కలవనుంది…
- తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్ వైపు వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి వద్దకు చేరుకోనున్నాయి.
- టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్ జంక్షన్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు వెళ్లనున్నాయి.
- ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్ వద్ద చేరి, ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్లనున్నాయి.
- టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చే గణేష్ విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్ ఎక్స్‌రోడ్, గోషామహల్, మాలకుంట జంక్షన్ మీదుగా వెళ్లి ఎంజేఎం దగ్గర ప్రధాన ఊరేగింపులో కలువనుంది…
18వ తేదీ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు
ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 18వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ సి.వి.ఆనంద్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ డైవెర్షన్ ప్రధాన ఊరేగింపు మార్గల్లో శోభాయాత్ర వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలకు అనుమతి ఉండదు.
అవసరమైతే పోలీసులు ఈ ట్రాఫిక్ ఆంక్షలు పొడిగిస్తారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్), ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌లలో 17వ తేదీ 6గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఆర్టీసీ బస్సుల రూట్‌పై ఆంక్షలు విధించారు.