పోలీసులంటే చాలామంది భయపడుతుంటారు. కఠినంగా వ్యవహరిస్తారని, ఏదైనా సమస్య ఉంటే ముందు చేయి చేసుకున్న తర్వాత కానీ విషయమేంటో తెలుసుకోరనే అపవాదు ఉంది. అంతేకాకుండా నోరు తెరిస్తే చాలు బండ బూతులు తిడతారన్న కారణంతో కూడా చాలామంది జనం వారి చెంతకు వెళ్లడానికి కూడా జంకుతుంటారు. అయితే.. అందరు పోలీసులు ఒకేలా ఉండరన్నది కొన్ని పరిస్థితులను గమనిస్తే తెలిసిపోతుంది.. ఎందుకంటే.. వారు చేస్తున్న మంచి పనులు, మానవత్వం వంటివాటిని చాటిచెబుతుంటాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా ఈ ఇన్సిడెంట్‌ని చెప్పుకోవచ్చు..
నిన్న సికింద్రబాద్‌లో జరిగిన ఓ ఘటన ఆ పోలీసు ఆఫీసర్ మంచితనాన్ని, మానవత్వాన్ని, ప్రజల పట్ల తనకున్న నిబద్ధతను బయటపెట్టింది. అందరూ చూస్తుండగానే ఓ మహిళ డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్ దగ్గరకు వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చింది.. బందోబస్తు డ్యూటీలో ఉన్న ఆ ఏసీపీ దగ్గరికి మహిళ అలా రావడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. కానీ, అక్కడ అసలు విషయం వేరే అని తెలుసుకుని హమ్మయ్యా అంటూ రిలీఫ్ ఫీలయ్యారు.. ఆ మహిళ.. ‘‘సార్ నేను.. అంటూ.. గుర్తు చేసింది. ఒక్కసారిగా అక్కడున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయం తెలుసుకొని హ్యాట్సాఫ్ పోలీస్ అన్నారు.
అసలు విషయం ఏంటంటే..
మహంకాళి ఏసీపీ రవీందర్ యాదవ్ 2014లో హైదరాబాద్‌లోని టప్పాఛబుత్ర పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో కార్వాన్‌కు చెందిన ఓ మహిళ (కవిత) అనారోగ్యంతో బాధపడుతూ రోడ్డుపై పడిపోయింది. ఇది గమనించిన ఇన్స్పెక్టర్ రవీందర్ ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తన సొంత డబ్బులతో చికిత్స, ఆపరేషన్ చేయించారు. అయితే.. ఈ ఘటన జరిగి దాదాపు పదేళ్లు కావస్తోంది. కాగా, ఆదివారం ఆ మహిళ సికింద్రాబాద్ మీదుగా బస్సులో వెళ్తుండగా డ్యూటీలో ఉన్న రవీందర్ కనిపించడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. బస్సును ఆపేసి, అక్కడి నుంచి ఏసీపీ రవీందర్ దగ్గరకు పరుగు పరుగున వచ్చేసింది.
సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో ఆదివారం జరిగిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమానికి ఏసీపీ రవీందర్ యాదవ్ బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. బస్సులో వెళ్తున్న కవిత ఏసీపీ రవీందర్ యాదవ్‌ను చూసి, గుర్తించింది. బస్సు దిగి ఏసీపీ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చింది. సార్, “నేను కవితను.. నేను ఈ రోజు బతికి ఉన్నానంటే మీరే కారణం సార్”.. అంటూ కన్నీరు పెట్టుకుంది. అంతటితో ఆగకుండా అన్నా.. మీ కోసం వెండి రాఖీ తీసుకున్నా.. పండుగ రోజు వచ్చి కడుతానని చెప్పి.. ఏసీపీ ఫోన్ నంబర్ తీసుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకుని, ఆ మహిళ ఆనందం చూసిన అక్కడి స్థానికులు, తోటి పోలీసులు హ్యాట్సాఫ్ .. అంటూ సెల్యూట్ చేస్తున్నారు. ఏసీపీ రవీందర్ యాదవ్ మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.