హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలను పరిశీలించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నెల 13వ తేదీన మేడిగడ్డ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ పర్యటనలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్వర్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రాజెక్టు సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ను ఆహ్వానించే భాద్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. ఈ నెల 13న చేపట్టనున్న మేడిగడ్డ సందర్శనకు అటు బీజేపీ నేతలు కూడా సై అంటున్నారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రాజెక్టును సందర్శిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.
12న అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్ట్ లపై చర్చ..
అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 12వ తేదీతో ముగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్ శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. ఈ నెల 12వ తేదీన అసెంబ్లీలో ఇరిగేషన్‌పై చర్చ జరగనుంది. విజిలెన్స్ ఇరిగేషన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు.
మానవ తప్పిదమే…
మేడిగడ్డ ప్రాజెక్టులో వరదలు కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ ఇటీవల అంచనాకు వచ్చిన విషయం తెలిసిందే. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది.