హైదరాబాద్ – తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లలో నేటి నుంచి నవంబర్ 20 వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు చెప్పారు. పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లిలో నవంబర్ 19, 20 తేదీల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వివరించారు.
హైదరాబాద్లో, నవంబర్ 20 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
నల్గొండ, నిజామాబాద్, నారాయణపేట, సూర్యాపేట, కుమురం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డిలో శనివారం 0.5 మి.మీ నుంచి 3.8 మి.మీ వరకు తేలికపాటి వర్షం కురిసిందని తెలిపింది.
పలు జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అయితే హైదరాబాద్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే నెల రోజుల్లో హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
చలికాలం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. మందపాటి దుస్తువులు ధరించాలని వివరిస్తున్నారు. చెవుల్లోకి చలి గాలి వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంటున్నారు.