అక్కడ.. ఇక్కడ ఒకే ముఠా పనే!
సరూర్‌నగర్‌లో తెరలేపింది.. అక్కడే నిందితులే!
డాక్టర్ రాజశేఖర్, పవన్ గ్యాంగ్ కొనసాగిస్తున్న దండా
చెన్నైలో అరెస్టయిన డాక్టర్ రాజశేఖర్
దాతలను.. గ్రహీతలను సేకరిస్తోంది పవన్ గ్యాంగ్
ఆపరేషన్ చేసేది డాక్టర్ రాజశేఖరే
హైదరాబాద్ సిటీ సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్‌కు విశాఖలోని కిడ్నీ రాకెట్‌తో లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2023లో విశాఖ సిటీ పెందుర్తిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ముఠా ఇక్కడ ముఠా ఒక్కటే అని తేలింది. కిడ్నీ రాకెట్‌కు ప్రధాన కారకుడైన డాక్టర్ రాజశేఖర్‌ను చెన్నైలో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు విచారణలో పెందుర్తి జరిగిన కిడ్నీ రాకెట్‌లో నిందితుడిగా ఉన్న డాక్టర్ రాజశేఖర్ జైలుకెళ్లిన విషయం బయటపడింది. కిడ్నీ దాతలను.. గ్రహీతలను పవన్ గ్యాంగ్ తీసుకొస్తున్న విషయం పోలీసు విచారణలో తేలింది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ గ్యాంగ్ దొరికితే ఎన్ని రాష్ట్రాల్లో కిడ్నీ రాకెట్ ఉందో బయటపడే అవకాశాలు లేకపోలేదు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతోంది. తాజాగా రాచకొండ పోలీసులకు ఏపీలోని విశాఖ కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించిన లింకు దొరికింది. విశాఖలో ఇలాంటి కేసు వ్యవహారం నిందితుడైన డాక్టర్ రాజశేఖర్, పవన్ గ్యాంగ్ సూచనలతో హైదరాబాద్‌లో దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. చెన్నైలో రాజశేఖర్‌ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సరూర్‌నగర్ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు.
విశాఖలో వెలుగు చూసిన జాతర…
విశాఖపట్నం సిటీ పెందుర్తిలోని 2023లో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి కేసులో నిందితులు రూటు మార్చి హైదరాబాద్ కేంద్రంగా దందా చేస్తున్నారు. అలకనంద ఆసుపత్రి కేసులో వైద్యుడు పెరుమాళ్ల రాజశేఖర్ అరెస్టుతో ఇది రూఢీ అయ్యింది. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులోనూ రాజశేఖర్ అరెస్టై జైలుకెళ్లినట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. విశాఖలో పాతకేసు నేపథ్యంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా హైదరాబాద్‌లో దందా చేస్తున్నట్లు గుర్తించారు.
నెల్లూరుకు చెందిన రాజశేఖర్
నెల్లూరు జిల్లా మిలిటరీ కాలనీకి చెందిన పెరుమాళ్ల రాజశేఖర్ చెన్నైలోని పెరుంబలంలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం చెన్నైలోని సవిత మెడికల్ కళాశాలలో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2023 మే నెలలో విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ అంశం తెర మీదకొచ్చింది. పెందుర్తిలోని ఓ ఆసుపత్రిలో అనధికారికంగా కిడ్నీ తొలగించారని ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ దందా విషయం బయటపడింది. విశాఖకు చెందిన బాధితుడి కిడ్నీని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తికి అమర్చారు. ఈ ఆపరేషన్‌ను వైద్యుడు రాజశేఖర్ పెరుమాళ్ల చేసినట్లు గుర్తించిన పెందుర్తి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. దర్యాప్తు క్రమంలో దాదాపు పది మందికి పైగా నిందితుల్ని అక్కడ పోలీసులు అరెస్టు చేశారు.
ఒక్కో ఆపరేషన్‌కు గరిష్ఠంగా రూ.5 లక్షలు :
హైదరాబాద్‌లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో డాక్టర్ రాజశేఖర్ సేవలు అందిస్తున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించారు. జైలుకి వెళ్లి వచ్చిన ఆయన కొన్ని నెలల పాటు స్తబ్ధుగానే ఉన్నాడు. డబ్బుకు ఆశపడి 2024 నుంచి పవన్ గ్యాంగ్ సూచనలతో హైదరాబాద్‌లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలకు అంగీకరించాడు. హైదరాబాద్‌లో చేసే ఒక్కో ఆపరేషన్‌కు గరిష్ఠంగా రూ.5 లక్షలు తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆపరేషన్లలలో ఇతడితో పాటు జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో వైద్యుడు సాహిబ్ పాల్గొంటున్నాడు. సాహిబ్ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. అప్పట్లో విశాఖ కేసులో పవన్ అనే మధ్యవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. అలకనంద కేసులోనూ విశాఖకు చెందిన పవన్, పూర్ణ, లక్ష్మణ్‌లు కీలక నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ, హైదరాబాద్‌లో ఒకే ముఠా పనిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పట్లో అరెస్టైన నిందితుల వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
అంతా చూసుకుంటున్న పవన్ గ్యాంగ్
కిడ్నీ దాతలు, గ్రహీతలు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఆసుపత్రిని నిర్ణయించడం అంతా పవన్ గ్యాంగ్ చూసుకుంటుంది. తన ఫోన్ నెంబరు, ఆచూకీ ఎక్కడా బయటపడకుండా నిందితుడు వైద్యులకు వాట్సాప్ లొకేషన్‌ను పంపిస్తాడు. దాని ప్రకారమే వైద్యులు తేదీ, సమయానికి అలకనంద ఆసుపత్రికి వస్తారు. ఇంత వరకూ స్పష్టత ఉన్నా, కిడ్నీ గ్రహీతల వివరాలు ఎలా సంపాదించారన్నది మాత్రం ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది.