బీఆర్ఎస్ పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ ఆకుల లలిత రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్న లలిత.. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీలో కదుపు మొదలైంది. బోధన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పద్మా శరత్‌రెడ్డి దంపతులు పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. తన కార్యకర్తలతో సమావేశం అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆకుల లలిత.. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా మళ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీని వీడి.. తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారం జోరందుకుంది.