హైదరాబాద్ – సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించారని, ఆ దిశగా సరలీకరిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా జ్యోతిరాదిత్య తెలిపారు. బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను నేటి ఉదయం ఆయన ఆరంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ, ‘పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. విమాన ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్నారు. దానికి తగినట్లుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రపంచంలోనే ఇండియా విమాన ప్రయాణికుల పరంగా మూడో స్థానంలో ఉంది. దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి 2047లో విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాము. గత 10 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాము. ముంబై, ఢిల్లీలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాము. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో హెలిపాడ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. ఈ రోజు పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి’ అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
పైలట్లు, కెప్టెన్లుగా 15 శాతం మంది మహిళలు
’15 శాతం మహిళలు పైలట్లు, కెప్టెన్లుగా ఉన్నారు. ప్రపంచంలోనే ఇది అధిక శాతం. డ్రోన్లకు ఎంతో డిమాండ్ పెరిగింది. ఇందులో భాగంగా డ్రోన్ మహిళ పైలట్లను తీర్చిదిద్దుతున్నాము. ఉడాన్ 5.3 ఈ రోజు ప్రాంబించడం ఎంతో సంతోషంగా ఉంది. పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని మోడీ సంకల్పించారు. ఆ దిశగా సరలీకరిస్తున్నాము. ఆకాశమే మన హద్దు’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోందని వెల్లడించారు..