కాంగ్రెస్ పార్టీ నేత, ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేష్ కు ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ అత్యున్నత డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ- పీహెచ్డీ) పట్టాను ప్రదానం చేసింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక గెజిట్ ప్రకటన విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ, కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ కమతం శ్రీనివాస్ పర్యవేక్షణలో ” ఏ మల్టీ డైమెన్షనల్ స్టడీ ఆన్ పర్ఫామెన్స్ ఆఫ్ సెలెక్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా ” అనే అంశంపై ఇక్రా, క్రిసిల్, కేర్ లాంటి ప్రఖ్యాతిగాంచిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల మీద పరిశోధించారు. అనేక విషయాలను కనుగొని, కామర్స్ లో కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించినందుకుగాను ఉస్మానియా యూనివర్సిటీ, డా. కొనగాల మహేష్ కు పీహెచ్డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ) పట్టా ప్రదానం చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే గొప్ప రీసెర్చ్ అంశంగా ఈ థీసిస్ నిలవబోతోందనీ కామెంట్స్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి మానికం ఠాగుర్, బోస రాజు, రోహిత్ చౌదరి, నదిం జావేద్, సి.ఎల్. పి నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తదతరులు శుభాకాంక్షలు తెలిపారు.
ఉస్మానియ క్యాంపస్ లోని కామర్స్ విభాగంలో ఎం.కాం. పూర్తిచేసిన డా. కొనగాల మహేష్, మలిదశ తెలంగాణా ఉద్యమంలో కీలపాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన మహేష్, ప్రచార కమిటీ సభ్యునిగా, టిపిసిసి అధికార ప్రతినిధిగా వివిధ హోదాలలో పనిచేసి, ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.