నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయ లేమితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని మిల్లులకు అమ్ముకోవడానికి గత మూడు రోజులుగా మిర్యాలగూడలోని రైతు వేదికల వద్ద అధికారులు అన్నదాతలకు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు పడిగాపులు కాస్తున్నారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే తెలిసినా అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా రైతులు ధాన్యం ట్రాక్టర్లు తీసుకురావడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడం కూడా కష్టంగా మారిపోవడంతో రైతన్నలు అందోళనకు చేశారు. దీంతో నాలుగు రోజులకు సంబంధించిన టోకెన్లను జారీ చేశారు. ఈ నెల 6,7,8,9 తేదీలకు సంబంధించిన మొత్తం 4,299 టోకెన్లను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంపిణీ చేశారు.